న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటు వాది షబ్బీర్ షా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో టచ్‌లోనే ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) చార్జీషీట్లో పేర్కొంది. ఉగ్రసంస్థకు ఆర్థిక సాయం అందించిన కేసుకు సంబంధించి 2005లో హఫీజ్ సయిద్‌పై ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను పూర్తి చేసిన ఈడీ ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సిద్ధార్థ నాథ్ శర్మకు చార్జిషీట్‌ను అందించింది. ఇప్పటికే ఈ కేసులో షబ్బీర్ షాతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మహమ్మద్ అస్లాం వనీ పేరును కూడా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు తీసుకుంది. ఈ కేసులో నిందితులను ఈ నెల 27న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది.