ఆ గుర్రానికి కాలొచ్చింది!
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బీజేపీ నిరసన సందర్భంగా తీవ్రంగా గాయపడిన శక్తిమాన్ అనే గుర్రానికి కృత్రిమ కాలు అమర్చారు. ఇందుకోసం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. గుర్రం లేచి తన కొత్త కాలుమీద నిలబడిందని, దాంతో ఆపరేషన్ విజయవంతం అయినట్లేనని దానికి ఆపేరషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు. గుర్రం కాలు తీవ్రంగా గాయపడటం, దాన్ని అలాగే ఉంచేస్తే గాంగరిన్ కారణంగా అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును అంతకుముందు తీసేశారు. గుర్రాన్ని పదేపదే కర్రతో కొట్టారని ఆరోపణలు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాన్ని సందర్శించారు.
అయితే తాను అసలు దాన్ని కొట్టనే లేదని, మూగజీవి బాధపడుతోందన్న ఆవేదనతోనే ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు. వాస్తవానికి గుర్రం తీవ్రంగా గాయపడిన దృశ్యాల్లో ఎమ్మెల్యే జోషి కర్రతో ఉన్నట్లు కనిపించినా, ఆయన దాన్ని కొట్టిన దృశ్యాలు మాత్రం ఎక్కడా లేవు. మరో వ్యక్తి మాత్రం శక్తిమాన్ మీద పోలీసు స్వారీ చేస్తుండగా దాని కళ్లెం పట్టుకుని లాగేశాడు. దాంతో అది కింద పడిపోయింది. సదరు వ్యక్తిని వీడియో ఫుటేజిలో గుర్తించి, అరెస్టు చేశారు. గడిచిన మూడు రోజులుగా గుర్రాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సహా పలువురు నాయకులు పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న గుర్రం గాయపడినందుకు తాను ఎంతో బాధపడుతున్నానని, ఇది ఒక క్షతగాత్రుడైన సైనికుడితో సమానమని ఆయన అన్నారు.