
ముంబై: మనీ ల్యాండరిం గ్ కేసు విచారణకు తానే స్వచ్ఛందంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు ఈనెల 27న హాజరవుతానని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మహారాజా ఛత్రపతి శివాజీ భావజాలాన్ని అనుసరించే తాను కేంద్ర ప్రభుత్వం ముందు తలవంచబోనని స్పష్టంచేశారు. ‘ఈడీకి నా పూర్తి సహకారం ఉంటుంది’అని చెప్పారు. నేనే ముంబైలోని ఈడీ కార్యాలయానికి వెళ్తా. వాళ్లు అడిగే ఎలాంటి సమాచారాన్నైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా’అని పవార్ విలేకరులకు వెల్లడించారు. కాగా, పవార్, అతని సోదరుడి కుమారుడు అజిత్ పవార్, మరో 70 మందిపై ఈడీ కేసువేసింది.