
మోదీది ఖరీదైన కల
సాక్షి, ముంబైః ప్రధాని నరేంద్ర పనితీరుపై శివసేన మరోసారి ధ్వజమెత్తింది. మోదీ తన ఖరీదైన కలలకోసం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని సేనవ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై సేన విమర్శలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం అనసవరంగా 1.08 లక్షల కోట్ల రూపాయలను బుల్లెట్ ట్రైన్ కోసం ఖర్చుపెడుతోందని శివసేన పేర్కొంది. మోదీ ఖరీదైన కలను నెరవేర్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని విమర్శించింది.
సాధారణ వ్యక్తి కోసం ప్రధాని కలలు కనడంలేదని.. అత్యంత సంపన్న, ధనిక, వ్యాపార వర్గాల కొసం మాత్రమే ఆయనన కలలు కంటున్నారని సేన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. ముంబైలో లోకల్ ట్రైన్ సిస్టమ్ చాలా అస్తవ్యస్తంగా.. అనేక సమస్యలతో నడుస్తోందని.. దీనిని ముందు సంస్కరిస్తే బాగుండేదని శివసేన పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ కోసం పెట్టే పెట్టబడితో విదర్భ, కొంకణ్, మరఠ్వాడా ప్రాంతాల్లో అనేక రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని శివసేన సూచించింది.