ఫేస్ బుక్ లో షాకింగ్ వీడియో..
చెన్నైః సామర్థ్యానికి మించి.. భారీగా ప్రయాణీకులను ఎక్కించుకున్న ఓ బస్సు వరదల్లో కొట్టుకుపోవడం తమిళనాడు ప్రాంతంలో షాకింగ్ కు గురిచేస్తోంది. ప్రయాణీకులతోపాటు వరదల్లో చిక్కుకున్న బస్సును వీడియోగా చిత్రించిన వ్యక్తి.. దాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది.
ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అటు వాహనదారులు, ఇటు ప్రయాణీకులూ అప్రమత్తం కావడం లేదు. వర్షాలు, వరదలూ వచ్చిన సమయంలోనైనా కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రయాణాలు సాగించడం పరిపాటిగా మారిపోయింది. బస్సులోపలే కాక.. టాప్ మీద సైతం ప్రయాణీకులను భారీగా ఎక్కించుకుని ఓవర్ లోడ్ తో వెడుతున్నఓ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లలో ఆందోళన రేపుతున్నాయి. వరద బీభత్సంతో కొట్టుకుపోతున్న బస్సులోని కొందరు ప్రయాణీకులు ప్రాణాలు కాపాడుకునేందుకు నీటిలో దూకగా.. మిగిలినవారు బస్సుతోపాటు నదిలో కొట్టుకుపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కళ్ళెదుట కనిపించిన దృశ్యాలను వీడియోలో బంధించిన ఓ వినియోగదారుడు ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
తమిళనాడు ప్రాంతంలో ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ షాకింగ్ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే వేలకొద్దీ వ్యూస్ తో పాటు.. వందలసార్లు షేర్ కూడా అయ్యింది. కాగా ప్రమాదం ప్రస్తుత వర్షాల కారణంగా వచ్చిన వరదలకు సంబంధించినదా, గతంలో చెన్నైలో సంభవించిన వరదలకు చెందినదా అన్న వివరాలు మాత్రం తెలియలేదు.