మృత్యువును కళ్లారా చూసి బయటపడ్డారు!
లాహోర్: అది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు. పాకిస్థాన్, చైనా మధ్య ఉంటుంది. కారాకోరమ్ పర్వత శ్రేణులకు ఆనుకొని ఈ రోడ్డు ఉంది. కొండచరియలు, వర్షాలు పడితే భారీ వరదలు ఈ రోడ్డుపై నిత్యం కనిపించే దృశ్యాలు. బ్రిడ్జీలు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఇక్కడ వరదలు వస్తుంటాయి.
గత కొద్ది రోజులుగా ఈ కారాకోరం పర్వత శ్రేణుల్లో వర్షం పడుతోంది. దీంతో ఈ రోడ్డుపై వరద పోటెత్తింది. అదే సమయంలో కొందరుపాకిస్థాన్ వాసులు ఒక బస్సులో ఆ మార్గం గుండా వచ్చి ఆ వరదల్లో చిక్కుకుపోయారు. పక్కనే పెద్ద లోయ. కాసేపట్లోనే ఆ వరద బస్సును కబళించింది. దీంతో అందులో ఉన్నవారికి గుండెలు జారినంత పనైంది.
ధైర్యం చేసి బస్సు కిటికీల అద్దాలు తెరిచి గబగబా అందులో నుంచి ఒడ్డుకు దూకేశారు. ఒక వ్యక్తి మాత్రం బస్సులోని చిక్కుకుపోయాడు. వరద బస్సును అమాంతం ఈడ్చుకెళుతుండటంతో అతడు మెల్లగా బస్సు చివరి అంచునుంచి ముందు టైరువరకు పాక్కుంటూ వచ్చి ఏదో ఒకలా ఊపిరంతా కూడబబట్టుకొని ఒక్క ఉదుటన దూకగా అప్పటికే ఒడ్డున ఉన్నవారు అతడిని బయటకు లాగారు. దీంతో అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది క్షణాల తేడాతో అంతా మృత్యువు నుంచి తప్పించుకోగలిగారు.