మణిపురిః పదిహేను రూపాయలకోసం దళిత దంపతులను నరికి చంపిన ఘటన మరువక ముందే.. ఉత్తరప్రదేశ్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. 100 రూపాయలు లంచం ఇవ్వనందుకు ఇద్దరు కూలీలపై దాడి చేసి చంపిన పోలీసుల దాష్టీకం శుక్రవారం మణిపురి ప్రాంతంలో కలకలం రేపింది. ఇటుకలతో వెడుతున్న ట్రాక్టర్ ను ఆపిన పోలీసులు డ్రైవర్ వద్ద లంచం డిమాండ్ చేశారు. అతడు ఇచ్చేందుకు నిరాకరించడంతో కూలీలకు, పోలీసులకు మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో ఘటనాస్థలినుంచీ ఇద్దరు తప్పించుకొని పారిపోగా మరో ఇద్దరు కూలీలు పోలీసు దెబ్బలకు ప్రాణాలు కోల్పోగా వారిని దగ్గరలోనే ఉన్న చెరువులో పడేసినట్లు తెలుస్తోంది.
చెరువులో తేలుతూ కనిపించిన ఇద్దరు కూలీల మృతదేహాలు.. ఉత్తరప్రదేశ్ మణిపురి జిల్లా ఘిరార్ ప్రాంతంలో తీవ్ర ఆందోళనను రేపింది. మృతదేహాలను బయటకు తెచ్చిన కుటుంబ సభ్యులతోపాటు, గ్రామస్థులు మృతుల శవాలతో రహదారులు దిగ్బంధించి ఆందోళనకు దిగారు. 100 రూపాయల లంచంకోసం పోలీసులు చేసిన దౌర్జన్యానికి అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం మణిపురి ఎస్పీ దేవరంజన్ వర్మ గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైన ఇద్దరు హోం గార్డులతో సహా ఆరుగురు పోలీసులపై ఎఫ్ ఐ ఆర్ రిజిస్టర్ చేశామని, దర్యాప్తు అనంతరం నిందితులపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.
ఇటుకలు లోడ్ చేసిన ట్రక్ తో పాటు ప్రయాణిస్తున్న నలుగురు కూలీలను పోలీసులు ఘిరార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చెక్ పోస్టువద్ద శుక్రవారం ఉదయం అడ్డుకుని, వారివద్దనుంచీ 100 రూపాయలు లంచం డిమాండ్ చేశారని, డ్రైవర్ లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవ మొదలైనట్లు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఘటనాస్థలం నుంచీ ఇద్దరు తప్పించుకోగా.. మరోఇద్దర్నిపోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే వారు చనిపోయారని అనంతరం వారి మృతదేహాలను పోలీసులు పక్కనే ఉన్న చెరువులో పడేసినట్లు కంప్లైంట్ లో వివరించారు. మృతదేహాలు చెరువులో కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు దిగారు.
రూ.100 కోసం పోలీసులు ఇద్దరి ప్రాణాలు తీశారు...!
Published Sat, Aug 6 2016 3:32 PM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement