కేజ్రీవాల్‌పై బూటు దాడి
‘సరి-బేసి’పై విలేకరుల భేటీలో.. కేజ్రీకి కొద్ది దూరంలో పడ్డ బూటు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై మరోమారు దాడి జరిగింది. శనివారం ఢిల్లీ సెక్రెటేరియట్‌లో ‘సరి-బేసి’పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ వ్యక్తి కేజ్రీవాల్‌పై బూటు దాడి చేశాడు. అయితే బూటు కేజ్రీవాల్‌కు తాకలేదు. పక్కనే ఉన్న ఓ అధికారి వెంటనే స్పందించి కేజ్రీవాల్‌కు బూటు తాకకుండా అడ్డుకున్నారు. బూటు విసిరిన వ్యక్తిని వేద్ ప్రకాశ్‌గా పోలీసులు గుర్తించారు. ‘అరవింద్ గారు ఒక్క నిమిషం. సీఎన్జీ స్టిక్కర్ కుంభకోణంపై నేను ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాను. ఒక్కో స్టిక్కర్‌ను రూ.1,000కి పంపిణీ చేశారు. ఎందుకిలా చేస్తున్నారు.
ఎందుకు చర్యలు తీసుకోరు’ అని బూటు, సీడీ విసరడానికి ముందు ప్రకాశ్ ప్రశ్నించాడు. తర్వాత తాను ఆమ్ ఆద్మీ సేనకు చెందిన వ్యక్తిగా ప్రకటించుకున్నాడు. దాడి జరిగిన వెంటనే వేద్‌ను ఆప్ కార్యకర్తలు పక్కకు తోసేశారు. పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. తర్వాత సమావేశాన్ని కేజ్రీవాల్ కొనసాగించారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పర్యాటక మంత్రి కపిల్ శర్మ.. దాడి వెనక ఢిల్లీ బీజేపీ నేత హస్తముందని ఆరోపించారు. ప్రకాశ్ కాల్‌డేటాపై విచారణ చేపట్టాలని ట్వీట్ చేశారు. దాడిని ఖండించిన బీజేపీ.. ఇలాంటి ఘటనలు పదేపదే ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది.
ఎక్కువ దాడులు కేజ్రీపైనే..
► రాజకీయాల్లోకి వచ్చినప్పట్నుంచి కేజ్రీవాల్‌పై దాడులు సాగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఆయనపై దాడులు..
► 2013 నవంబర్‌లో హజారే మద్దతుదారుడినని ప్రకటించుకున్న ఓ వ్యక్తి.. కేజ్రీవాల్, ఆప్ కార్యకర్తలపై సిరా దాడి చేశాడు.
►2014 మార్చిలో వారణాసిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌పై కొందరు వ్యక్తులు గుడ్లు, సిరాతో దాడి చేశారు.
►2014 ఏప్రిల్‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వీపుపై ఓ వ్యక్తి కొట్టాడు. నాలుగు రోజుల తర్వాత సుల్తాన్‌పురిలో ఓ రిక్షావాలా కేజ్రీ చెంపపై కొట్టాడు.
► గత జనవరిలో ‘సరి-బేసి’ తొలి దశ విజయోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ సేన కార్యకర్త భావన అరోరా.. సిరా దాడి చేశారు.