రామమందిరంపై స్పందించిన సీఎం యోగి
కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యోగి వాయువేగంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కబేళాల విషయంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చగా మారింది. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం విషయంలో కూడా యోగి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూశారు. దీంతో తాజాగా చర్చల మార్గానికే ఆయన మద్దతిస్తూ అభిప్రాయం చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాను నేను స్వాగతిస్తున్నాను. ఈ సమస్య వివాద రహితంగా సమన్వయంతో చర్చల జరపడం ద్వారా పరిష్కరించుకోవాలి. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని యోగి చెప్పారు. గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) 2015లో, హైకోర్టు 2017లో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే తాము అక్రమ కబేళాలపై కొరడా ఝళిపించామని అన్నారు. ఇక ఆహారం విషయంలో ఎవరి ఇష్టం వారిదని అన్నారు. కాయగూరల భోజనం చేసేవారి ఆరోగ్యం బాగుంటుందని, అయితే, ఈ విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. అయితే, స్వేచ్ఛ పేరుతో అక్రమ చర్యలు చేస్తే మాత్రం ప్రభుత్వం తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.