
మాటల్లో కాదు చేతల్లో చూపండి!
రైతుల విషయంలో తమ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఉందని, వారికి ఎంతో మంచి చేయాలని నిర్ణయించామని, అయితే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ...
- యూపీఏలాగా రైతు రుణమాఫీ చేయగలరా?
- ప్రధాని మోదీపై కాంగ్రెస్ సహా విపక్షాల దాడి
న్యూఢిల్లీ: రైతుల విషయంలో తమ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఉందని, వారికి ఎంతో మంచి చేయాలని నిర్ణయించామని, అయితే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ శుక్రవారం బెంగళూరులో పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సహా కొన్ని విపక్ష పార్టీలు శనివారం నిప్పులు చెరిగాయి. ఉద్దేశం మంచిదైతే సరిపోదని, చేతల్లో చేసిచూపాలని చురకలంటించాయి. ప్రధాని వ్యాఖ్యలు ప్రగల్భాలను ప్రతిబింబిస్తున్నాయని, మాటలు కట్టిపెట్టి పనిచేసి చూపాలని కాంగ్రెస్ విమర్శించింది. ‘మోదీ మాటలకు చేతలకు పొంతన లేదు.
రైతుల పట్ల అంతప్రేమే ఉంటే.. సాహసం చేసి వారి రుణాలను రద్దు చేయాలి. యూపీఏ ప్రభుత్వం రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసింది. మోదీజీ.. మీరు ఆపాటి తెగువ చూపి.. రైతు రుణాలను రద్దు చేయగలరా?’ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీటర్‌లో ప్రశ్నించారు. దేశంలో చమురు ధరలు తగ్గడానికి తానే కారణమన్న ప్రధాని.. ప్రస్తుతం వడగళ్ల వానతో రైతులు పంటలు నష్టపోవడానికీ ఆయనే కారణమా? అని దిగ్విజయ్ అన్నారు.
ఈ సందర్భంగా కొన్ని నినాదాలకు పేరడీ చేసి.. ప్రధానిపై చలోక్తులు విసిరారు. ‘మీరు నాకు రక్తమిస్తే.. మీకు నేను స్వాతంత్య్రమిస్తానని సుభాష్ చంద్రబోస్ అంటే.. ప్రస్తుత ప్రధాని మోదీ.. రైతులు తనకు భూములిస్తే.. తాను మాత్రం వారికి నిరుద్యోగాన్నిస్తానని అంటున్నారు’ అని పేర్కొన్నారు.
కలల్లో తిప్పుతోంది: శరద్‌యాదవ్
మోదీ మాటలను కట్టిపెట్టి.. పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, రైతులకు లబ్ధి చేకూర్చే విషయాల్లో స్పష్టమైన వ్యూహం(రోడ్‌మ్యాప్)తో వ్యవహరించాలని జేడీ యూ చీఫ్ నేత శరద్ యాదవ్ అన్నారు. శుక్రవారం నాటి ప్రధాని వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఓ విధానమంటూ లేదని, ప్రజలను కలల్లో విహరింపజేస్తోందని విమర్శించారు. ‘ఉద్దేశాలూ, మాటలూ రైతుల సమస్యలను పరిష్కరించజాలవు. ఉద్దేశం కన్నా విధానమే అత్యంత ప్రధానం. అన్ని ప్రభుత్వాలూ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటాయి. అయితే, అసలు ప్రభుత్వానికి ఓ విధానం, కార్యక్రమం అంటూ ఉందా? ప్రభుత్వం చెబుతున్న మాటలను అవి సంపూర్ణం చేయగలవా? అనేదే ముఖ్యం’ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం.. విధానపరమైన విషయంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.