
ముంబై: దేవతలకు పూలు, పండ్లు, కొబ్బరికాయలు, విరాళాలు, కానుకలు ఇచ్చి కోరికలు కోరుకోవటం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఆ వ్యవహారం దారి తప్పింది. బాబా భైరోన్ నాథ్ దేవుడికి భక్తులు మద్యాన్ని బాటిళ్ల కొద్దీ తెచ్చి సమర్పించుకుంటారు. అనంతరం దానినే ప్రసాదంగా తీసుకుంటారు. ముంబై సమీపంలోని చెంబూర్ ఈ విడ్డూరానికి వేదికైంది. చెంబూర్‌లోని ఓ శ్మశానవాటిక వద్ద బాబా భైరోన్ నాథ్ పేరుతో చిన్న ఆలయం ఉంది. ఈ దేవుడిని శివుని అవతారంగా భావిస్తుంటారు భక్తులు. కార్తీక ఏకాదశి నాడు దేశంలోని వివిధ ప్రాంతాలు, మతాలకు చెందిన భక్తులు ఏటా ఇక్కడికి తరలివస్తారు.
వస్తూ వస్తూ వెంట విస్కీ, రమ్, వోడ్కా వంటి రకరకాల మద‍్యం బాటిళ్లను తీసుకువస్తారు. దేవుడికి పూజలు చేసి మద్యాన్ని సమర్పించుకుంటారు. ఆపై తెచ్చిన మద్యాన్ని తీసుకెళ్లి ప్రసాదంగా పంచి పెడతారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని, అంతా మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి చెంబూరుకు వలస వచ్చిన తమ కుటుంబీకులు ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేశారని ఆలయ ప్రధాన పూజారి లోహానా తెలిపారు. దేవుళ్లకు మద్యాన్ని నైవేద్యంగా ఇవ్వటం హిందూ సంప్రదాయంలో కొత్తేమీ కాదని ఆయన చెబుతున్నారు. పురాణాల్లో ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలున్నాయన్నారు.
కాగా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో ఉన్న కాలభైరవ ఆలయంలో కూడా ఇలాంటి వింత ఆచారం ఉంది. ఆ ఆలయ సాంప్రదాయం ప్రకారం భక్తులు ఎన్ని పూలు , పండ్లు సమర్పించినా వారి పూజ పరిపూర్ణం కాదు. ఇక్కడున్న దేవుడికి మద్యం సమర్పిస్తేనే పూజ పరిపూర్నమైనట్టు భావిస్తారు. కొత్తగా ఈ ఆలయ దర్శనానికి వెళ్ళిన భక్తులకు కూడా ఆలయ సాంప్రదాయం చెప్పి ఆలయం బైట విక్రయించే పూజా సామాగ్రిలో మద్యం బాటిల్ కూడా ఇస్తారు.
(ఉజ్జయినిలోని కాలభైరవ ఆలయం)
దేవుడికి పూజలు చేసి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు
Comments
Please login to add a commentAdd a comment