2020 నాటికి 92 వేల కోట్ల పరిశ్రమను సృష్టించడమే లక్ష్యం
దేశంలో ఇంటర్నెట్ పరిశ్రమ అభివృద్ధి
పాలసీ ముసాయిదాకు రూపకల్పన
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసిన ఇంటర్నెట్ మరింత వేగంగా విస్తరిస్తూ.. అరచేతిలోనే ప్రపంచాన్ని చూపెడుతోంది. ప్రతిరంగంలోనూ ఇంటర్నెట్ అనేక పరికరాలకు అనుసంధానం అవుతూ ఎన్నో సేవలను అందిస్తోంది. అందుకే.. ఇంటర్నెట్‌తో అనుసంధానమై పనిచేసే పరికరాలకు సంబంధించిన ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)’ పరిశ్రమ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి సారించింది. దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధిపర్చాలన్న లక్ష్యానికి తోడుగా ఐవోటీ పరిశ్రమను అభివృద్ధిపర్చాలని కేంద్రం భావిస్తోంది. మరో ఆరేళ్లనాటికి ఈ పరిశ్రమను రూ.92 వేల కోట్ల పరిశ్రమగా అభివృద్ధిపర్చాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ‘ఐవోటీ పాలసీ ముసాయిదా’ను రూపొందించింది. వివిధ రంగాల్లో ఈ పాలసీ కింద అమలు చేసేందుకు అనేక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఐవోటీ పాలసీ అమలు వల్ల దేశంలో ఇంటర్నెట్‌తో అనుసంధానమై పనిచేసే పరికరాల సంఖ్య ఆరేళ్లకే 20 కోట్ల నుంచి 270 కోట్లకు పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2011 నాటికే 1,250 కోట్ల ఇంటర్నెట్ అనుసంధానిత పరికరాలు ఉండగా, మరో ఆరేళ్లలో ఆ సంఖ్య 5 వేల కోట్లకు చేరవచ్చని అంచనా.
ఐవోటీ అంటే... వివిధ పరికరాలు ఇంటర్నెట్ ద్వారా ఒకదానికి ఒకటి అనుసంధానమై పనిచేయడాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)గా పిలుస్తారు. ఇంటర్నెట్ ద్వారా అనుసంధానమై పనిచేసే పరికరాలను తయారుచేసి, నిర్వహించే పరిశ్రమనే ఐవోటీ పరిశ్రమగా పేర్కొంటారు. అయితే ఐవోటీ పరిశ్రమ సేవలు ప్రస్తుతం దాదాపుగా అన్ని రంగాలకూ విస్తరిస్తున్నాయి. వ్యవసాయం, ఆరోగ్య సేవలు, ఇంధన రంగం, భద్రత, విపత్తుల నిర్వహణ.. ఒకటేమిటి దాదాపు అన్నిరంగాల్లోనూ ఎన్నో సమస్యలకు రిమోట్‌తో అనుసంధానమయ్యే పరికరాల ద్వారా మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్ పరిష్కారాలు పొందేందుకు ఐవోటీ వీలు కల్పిస్తుంది. ఐవోటీ పరికరాల ద్వారా.. వీధిలైట్లు సమయం ప్రకారం లేదా వెలుతురు లభ్యతను బట్టి ఆటోమేటిక్‌గా వెలిగేలా, ఆరిపోయేలా చేయొచ్చు. ట్రాఫిక్ సిగ్నళ్లను ఆటోమేటిక్‌గ్గా నియంత్రించొచ్చు. రిజర్వాయర్ల నుంచి పబ్లిక్ కుళాయిల వరకూ నీటి ప్రవాహం, నాణ్యతను పర్యవేక్షించొచ్చు. స్మార్ట్ పర్యావరణ పరికరాలతో వాయుకాలుష్యాన్ని పర్యవేక్షించవచ్చు.
ఆరేళ్లలో ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’ విశ్వరూపం!
Published Mon, Oct 27 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM
Advertisement
Advertisement