యువ ‘సంకల్ప్’
- రూ. 4 వేల కోట్లతో నైపుణ్య వృద్ధి పథకం
- 3.5 కోట్ల మంది యువతకు శిక్షణ
యువతకు ‘స్కిల్’ కేంద్రాలు
‘త్రీ ఇడియట్స్‌లో’ పున్షుక్ వాంగ్‌డూ తెలుసు కదా!! అనుభవాలనే ప్రయోగాలుగా మారుస్తుంటాడు. అలాంటివాళ్లను తయారు చెయ్యటానికి సైన్స్‌పై ఫోకస్ పెట్టి... స్థానిక ఆవిష్కరణల్ని కూడా పాఠ్యాంశాల్లో చేరుస్తామని జైట్లీ చెప్పారు. 600 జిల్లాల్లో ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలు... 100 అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి... వీటిలో అత్యాధునిక శిక్షణతో పాటు విదేశీ భాషలు కూడా నేర్పిస్తారట. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతో ఐటీఐల్ని అనుసంధానిస్తామన్నారు. కాకపోతే ఇపుడు ఐటీఐల పనితీరు అంతంతమాత్రమన్నది తెలియనిదేమీ కాదు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ... ఈ శిక్షణ పొందిన వారికి ఉపాధి కూడా ముఖ్యమే కదా?
దేశంలో పెద్దసంఖ్యలో ఉన్న యువత శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ‘సంకల్ప్’పథకాన్ని ప్రారంభించనుంది. 3.5 కోట్ల మందికి మార్కెట్ అవసరాలకు సరిపోయే శిక్షణ ఇచ్చేందుకు రూ. 4 వేల కోట్లతో స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్‌నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ ప్రోగ్రామ్(సంకల్ప్)ను 2017–18లో ప్రారంభించనున్నట్లు జైట్లీ తెలిపారు. సామాన్యులకు ఉపయోగపడని విద్యతో ఏం ప్రయోజనముందన్న వివేకానందుడి మాటలను ఆయన ఉటంకించారు.
– న్యూఢిల్లీ
యువత నైపుణ్యాల అభివృద్ధి కోసం జైట్లీ చేసిన మరికొన్ని ప్రతిపాదనలు..
► ప్రస్తుతం 60 జిల్లాల్లో ఉన్న ప్రధాన్‌మంత్రి కౌశల్ కేంద్రాలను 600కుపైగా జిల్లాలకు విస్తరించడం.
► విదేశాల్లో ఉద్యోగాల కోసం యత్నించే వారికి అధునాతన శిక్షణ, విదేశీ భాషా కోర్సులు అందించేందుకు దేశవ్యాప్తంగా 100 ఇండియా ఇంటర్నేషనల్ స్కిల్ సెంటర్ల ఏర్పాటు.
► పరిశ్రమల కోసం నైపుణ్యాల వృద్ధికి సంబంధించిన స్కిల్ స్ట్రెంగ్తెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్(స్ట్రయివ్) పథకం రెండో దశ ప్రారంభం. దీని కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు. దీని కింద ఐటీఐలలో ఇచ్చే శిక్షణను బలోపేతం చేస్తారు.
► పాఠశాలల్లో అభ్యసన ఫలితాల విశ్లేషణ కోసం వార్షిక మూల్యాంకన విధానం. స్థానికంగా నవకల్పనల ప్రోత్సాహం, లింగ సమానత్వం కోసం ‘ఇన్నోవేషన్ ఫండ్ సెకండరీ ఎడ్యుకేషన్’ఏర్పాటు, విద్యాపరంగా వెనకబడిన 3,479 బ్లాకులపై ప్రత్యేక దృష్టి. ‘స్వయం’ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా 350 కోర్సులు.
కాగా, ప్రపంచ బ్యాంకు మద్దతు ఉన్న సంకల్ప్, స్ట్రయివ్ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. బడ్జెట్ ప్రతిపాదనలు దేశం లో నైపుణ్యాల అభివృద్ధికి విస్తృతంగా దోహదం చేస్తాయని నైపుణ్యాల అభివృద్ధి, వ్యవస్థాపన మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ పేర్కొన్నారు.