
ఆటోల కంటే చవకగా ట్యాక్సీ ఛార్జీలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం 'స్మార్ట్ టాక్సీ' లను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి గోపాల్ రాయ్ శనివారం తెలిపారు. ఈ టాక్సీలు ఆటోల ఛార్జీ రేట్ల కంటే చాలా తక్కువ ధరలకే రవాణా సేవల్ని అందించనున్నాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, సొంతంగా వాహనాలు లేని వారు ఖచ్చితంగా ఆటోలలో ప్రయాణిస్తుంటారు.
ఢిల్లీ మెట్రో రైలు వంటివి ఆయా ప్రయాణికుల ఇంటి వరకు రవాణా సౌకార్యాలను కల్పించలేని సందర్భాలలో ఆటోలలో నగర ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆటోలలో ప్రయాణించే సామాన్యుల జేబుకు చిల్లు పడక తప్పదని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం స్మార్ట్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనుందని ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అత్యంత చవకగా రవాణా సేవలను అందించడంతో పాటు ఇంటివరకూ సురక్షితంగా చేరుకునే సదుపాయాలు ఢిల్లీ ప్రజలకు త్వరలోనే ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు.