Auto rickshaws
-
Project Gagan: అయిదేళ్లలో లక్ష ఎలక్ట్రిక్ ఆటోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ జీరో21 తాజాగా ప్రాజెక్ట్ గగన్‌ను ప్రారంభించింది. దీని కింద వచ్చే అయిదేళ్లలో 1 లక్ష ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలను రెట్రో ఫిట్టింగ్ ప్రక్రియ ద్వారా ఎలక్ట్రిక్‌కి మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్సే్చంజ్ చేయడం ద్వారా దీన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కన్వర్షన్ కిట్‌ను రూపొందించినట్లు సంస్థ వ్యవస్థాపకులు రాణి శ్రీనివాస్ తెలిపారు. దీనితో ఏదైనా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో (ఐసీఈ) నడిచే త్రీ–వీలర్లను కేవలం నాలుగు గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనంగా మార్చవచ్చని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గి, డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రయోజనం లభించగలవని శ్రీనివాస్ వివరించారు. ప్రధానంగా ఆటో రిక్షా యజమానులు, ఫ్లీట్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ గగన్‌ను చేపట్టినట్లు ఆయన చెప్పారు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ)ని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు, ధ్వని కాలుష్యం తగ్గగలదని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే జీరో21 సంస్థ ప్యాసింజర్, లోడ్ క్యారియర్ సెగ్మెంట్లలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లను తయారు చేస్తోంది. అలాగే రెట్రోఫిట్ కిట్లను కూడా అందిస్తోంది. -
ఐక్యతా విగ్రహం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో ఉన్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. స్టాచ్యు ఆఫ్ యూనిటీ పరిసరాల్లో టూరిస్టులను తిప్పే 15 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఛార్జింగ్ చేస్తుండగానే మంటలు అంటుకున్నట్లు వస్తున్న వార్తలను స్టాచ్యు ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్మెంట్, టూరిజం గవర్నెన్స్ అథారిటీ తిరస్కరించింది. ఛార్జింగ్ పాయింట్‌కు 35 అడుగుల దూరంలో ఉన్నాయని స్పష్టం చేసింది. ఐక్యతా విగ్రహం వద్దకు వచ్చే టూరిస్టుల కోసం 90 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. వాటికి స్థానిక ట్రైబల్ మహిళలు డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. ‘గురువారం తెల్లవారుజామున కెవాడియా గ్రామం సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్ వద్ద నిలిపి ఉంచిన 15 ఆటో రిక్షాలల్లో మంటలు చెలరేగాయి. అందుకు గల కారణాలు తెలియరాలేదు. ఛార్జింగ్ స్టేషన్‌కు 35 అడుగుల దూరంలో వాటిని నిలిపి ఉంచారు. దాంతో ఛార్జింగ్ చేస్తుండగా మంటలు వచ్చాయనేందుకు సరైన ఆధారాలు లేవు.’ అని ఓ ప్రకటన జారీ చేసింది ఎస్ఓయూఏడీటీజీఏ. మంటలపై సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఇతర వాహనాలకు వ్యాపించకముందే మంటలను ఆర్పివేసింది. ఈ సంఘటనపై ఆటో రిక్షాలను నిర్వహిస్తోన్న ప్రైవేటు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్ల పుట్టుకకు కేంద్రంగా చైనా.. నిపుణుల ఆందోళన -
ఆటోలో ప్రయాణించి కేజ్రీవాల్ హల్చల్.. ఊహించని గిప్ట్ ఇచ్చిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. గురువారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఐదు ఆటోలను గిఫ్టుగా ఇచ్చారు. ఇకపై ఆయన ఎస్కార్ట్ ఇదేనని, సీఎం భద్రతా సిబ్బంది, ప్రైవేటు సెక్రెటరీ ఈ ఆటోల్లోనే ప్రయాణించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 12న గుజరాత్ అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటో డ్రైవర్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లారు. ఆయన బస చేసే హోటల్ నుంచి ఆటోలోనే ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కేజ్రీవాల్‌ను అడ్డుకున్నారు. కానీ ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు భద్రత అవసరం లేదని ఆటోలోనే వెళ్తానని తేల్చి చెప్పారు. దీంతో పోలీసులే వెనక్కి ఆయనతో పాటు ఆటో డ్రైవర్ ఇంటికి ఎస్కార్ట్‌గా వెళ్లారు. అయితే కేజ్రీవాల్ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఆయన పబ్లిసిటీ కోసమే పట్టుబట్టి ఆటోలో వెళ్లారని ధ్వజమెత్తింది. ఈ క్రమంలోనే గురువారం కేజ్రీవాల్‌కు ఐదు ఆటోలను కానుకగా ఇచ్చింది. 'కేజ్రీవాల్ కాన్వాయ్‌లో 27 వాహనాలున్నాయి. 200మంది భద్రతా సిబ్బంది ఉంటారు. కానీ గుజరాత్లో ఆయన కావాలని ఆటోలో ప్రయాణించి హైడ్రామా చేశారు. అందుకే ఆయనకు ఐదు ఆటోలు గిఫ్ట్‌గా ఇస్తున్నాం. ఒక ఆటో పైలట్‌గా ఉంటుంది. జాతీయ జెండా ఉన్న ఆటో సీఎం కేజ్రీవాల్ కోసం. మరో రెండు ఆటోలు ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్తాయి. ఇంకో ఆటోలో కేజ్రీవాల్ ప్రైవేటు కార్యదర్శి వెళ్తారు' అని ఢిల్లీ ప్రతిపక్షనేత రామ్‌వీర్ సింగ్ బిద్ధూరి సెటైర్లు వేశారు. Delhi BJP MLAs visited CM residence and provided him a convoy of autos so that he can use them instead of cars for his office work. pic.twitter.com/2gQDVYUz8c — Siddharthan (@siddharthanbjp) September 15, 2022 చదవండి: నితీశ్ కుమార్‌తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు -
హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్.. ఇకపై ఆ ఆటోలకు ఎంట్రీ లేదు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో నమోదైన ఆటో రిక్షాలను మాత్రమే ఓలా, ఉబెర్‌లలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరగడానికి అనుమతించబోమన్నారు. ఇతర ప్రాంతాల్లో నమోదైన ఆటోరిక్షాలు ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమై నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, దీంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ ఆటో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహాయించి మిగతా సిరీస్‌లో కనిపించే ఆటోలకు అనుమతి ఉండబోదని చెప్పారు. అలాంటి ఆటోలపై జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను కూడా ఓలా, ఉబెర్‌లకు అనుసంధానమై నడిపేందుకు అనుమతించడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు. ఏ నిబంధనల మేరకు వాటిని అనుమతించారో స్పష్టం చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. ఇలాంటి ప్రైవేట్ ద్విచక్ర వాహనాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వాహనాల వేగ నియంత్రణపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్టీఏ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు. -
టూవీలర్లకు ఈ పథకం వర్తించదు : మంత్రి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం టూవీలర్ ట్యాక్సీలకు ప్రస్తుతం వర్తించదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏటా రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందజేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది నుంచి అర్హులైన టూవీలర్ ట్యాక్సీలకు కూడా ఈ పథకం అమలు చేసే దిశగా ఆలోచిస్తామని మంత్రి తెలిపారు. ఈ పథకం వచ్చే నెల 4 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్న మంత్రి దరఖాస్తులను ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. వాహనాలను ఫైనాన్స్‌లో తీసుకున్నవారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, లబ్దిదారులు కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవాలని కోరారు. దాదాపు నాలుగు లక్షల దరఖాస్తులు రావొచ్చనే అంచనాలున్నాయని పేర్కొన్న మంత్రి, ఒకవేళ అంతకు మించి దరఖాస్తులొచ్చినా ఇబ్బంది లేకుండా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. -
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోబంద్
- సన్నద్ధమవుతున్న ఆటోసంఘాలు - 150 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రవాణా, పోలీసు అధికారుల స్పెషల్‌డ్రైవ్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన నిరవధిక ఆటోబంద్‌కు ఆటోసంఘాలు సన్నద్ధమవుతున్నా యి. ప్రత్యేక తనిఖీల పేరిట తమపై కొనసాగుతు న్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని డిమాం డ్ చేస్తూ సుమారు 15 ఆటోసంఘాలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటోబంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్‌లోని సుమారు లక్షా 30 వేల ఆటోలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ కారణం గా 8 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బం దులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు తిరిగే 3,550 బస్సులతో పాటు మరో 150 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రద్దీ అధికంగా ఉండే రూట్లలో, సికింద్రాబాద్,నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్ తదితర రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌షుఖ్‌నగర్ బస్స్టేషన్లకు వీటిని నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ తెలిపారు.బంద్ వల్ల తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా అవసరమైన మార్గాల్లో బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. స్పెషల్‌డ్రైవ్ నిలిపివేయాలి :ఆటోసంఘాల జేఏసీ బంద్ నేపథ్యంలో ఆటోసంఘాల జేఏసీ విస్తృత ప్రచారం చేపట్టింది. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం, తదితర కార్మిక సంఘాలు శనివారం ప్రచారంలో నిమగ్నమయ్యాయి. స్పెషల్ డ్రైవ్‌ను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జేఏసీ నేత ఏ.సత్తిరెడ్డి తెలిపారు. ఆటోమీటర్ ట్యాంపరింగ్, పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా ఆటోలు నడపడం, ప్రయాణికులపై దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపై ఈ నెల 16 నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సంగతి విదితమే. -
ఆటోల కంటే చవకగా ట్యాక్సీ ఛార్జీలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం 'స్మార్ట్ టాక్సీ' లను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి గోపాల్ రాయ్ శనివారం తెలిపారు. ఈ టాక్సీలు ఆటోల ఛార్జీ రేట్ల కంటే చాలా తక్కువ ధరలకే రవాణా సేవల్ని అందించనున్నాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, సొంతంగా వాహనాలు లేని వారు ఖచ్చితంగా ఆటోలలో ప్రయాణిస్తుంటారు. ఢిల్లీ మెట్రో రైలు వంటివి ఆయా ప్రయాణికుల ఇంటి వరకు రవాణా సౌకార్యాలను కల్పించలేని సందర్భాలలో ఆటోలలో నగర ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆటోలలో ప్రయాణించే సామాన్యుల జేబుకు చిల్లు పడక తప్పదని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం స్మార్ట్ ట్యాక్సీ సేవలను ప్రారంభించనుందని ఢిల్లీ పర్యాటకశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అత్యంత చవకగా రవాణా సేవలను అందించడంతో పాటు ఇంటివరకూ సురక్షితంగా చేరుకునే సదుపాయాలు ఢిల్లీ ప్రజలకు త్వరలోనే ఏర్పాటుచేస్తామని ఆయన పేర్కొన్నారు. -
రెండోరోజు కొనసాగుతున్న ఆటోల బంద్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆటోల బంద్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానా మొత్తాన్ని వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 108ని ఉపసంహరించుకోవాలని నిన్న ఆటో సంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపు నిచ్చాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్‌లోని దాదాపు లక్షా 60 వేల వివిధ రకాల వాహనాలు రోడ్డెక్కలేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆటోలకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ యాజమాన్యం అదనపు బస్సులను నడపడంలో విఫలమైంది. సిటీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో రోజూ కూడా నగరంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
రెండో రోజు కొనసాగుతున్న ఆటోల బంద్...
-
హైదరాబాద్‌లో ఆగిన ఆటో రిక్షా
-
హైదరాబాద్‌లో ఆగిన ఆటో రిక్షా
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో ఆటో రిక్షా ఆగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానా మొత్తాన్ని రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 108 కి వ్యతిరేకంగా గ్రేటర్‌లోని అన్ని ఆటో సంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపున్విడంతో మంగళవారం అర్థరాత్రి నుంచి ఎక్కడి ఆటోలు అక్కడే నిలిచిపోయాయి. అన్నిరకాల వాహనాలు కలుపుకొని గ్రేటర్లో మొత్తం లక్షా 60 వేల వాహనాలు రోడ్డెక్కలేదు. సుమారు 80 వేల ప్రయాణికుల ఆటోలు, మరో 30 వేల విద్యార్థుల ఆటోలు, 20 వేల వరకు స్కూల్ ఓమ్ని వ్యాన్లు, మరో 30 వేల వస్తురవాణా వాహ నాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. నిరుపేద డ్రైవర్ల నడ్డివిరిచే విధంగా ఉన్న 106 జీవోను వెంటనే రద్దు చేయాలని, ఈ చలానా పద్ధతికి స్వస్తి చెప్పాలనే ప్రధాన డిమాండ్లతో ఆటోసంఘాలు నిరవధిక సమ్మెకు దిగాయి. మరోవైపు అక్కడక్కడ రోడ్డెక్కిన ఆటోలను యూనియన్ నేతలు అడ్డుకుంటున్నారు. మహానగరంలో ఏ వాహనమైన స్టాప్ లైన్ దాటికే రూ. వెయ్యి జరిమానా చెల్లించాలంటూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారుతున్నాయి. రోజంతా రెక్కాడితే గానీ రూ. అయిదు వందల సంపాదించటం గగనంగా ఉన్న తాము స్టాప్‌లైన్ దాటితే వెయ్యిరూపాల జరిమానా ఎలా కడతామంటూ పలు ఆటోడ్రైవర్ల యూనియన్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశాయి. అయితే సర్కారు ఆదేశాలను వెంటనే సవరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో పలు పాఠశాలలు సెలవును కూడా ప్రకటించాయి. ఆటోల బంద్‌తో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.