
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోబంద్
- సన్నద్ధమవుతున్న ఆటోసంఘాలు
- 150 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోలీసు అధికారుల స్పెషల్‌డ్రైవ్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన నిరవధిక ఆటోబంద్‌కు ఆటోసంఘాలు సన్నద్ధమవుతున్నా యి. ప్రత్యేక తనిఖీల పేరిట తమపై కొనసాగుతు న్న వేధింపులను వెంటనే నిలిపివేయాలని డిమాం డ్ చేస్తూ సుమారు 15 ఆటోసంఘాలతో ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటోబంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రేటర్‌లోని సుమారు లక్షా 30 వేల ఆటోలు ఆదివారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఈ కారణం గా 8 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇబ్బం దులకు గురయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు తిరిగే 3,550 బస్సులతో పాటు మరో 150 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రద్దీ అధికంగా ఉండే రూట్లలో, సికింద్రాబాద్,నాంపల్లి, కాచిగూడ, బేగంపేట్ తదితర రైల్వేస్టేషన్‌లు, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌షుఖ్‌నగర్ బస్‌స్టేషన్‌లకు వీటిని నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ తెలిపారు.బంద్ వల్ల తలెత్తే ఇబ్బందుల దృష్ట్యా అవసరమైన మార్గాల్లో బస్సులను పెంచనున్నట్లు తెలిపారు.
స్పెషల్‌డ్రైవ్ నిలిపివేయాలి :ఆటోసంఘాల జేఏసీ
బంద్ నేపథ్యంలో ఆటోసంఘాల జేఏసీ విస్తృత ప్రచారం చేపట్టింది. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, తెలంగాణ ఆటోడ్రైవర్‌ల సంక్షేమ సంఘం, తదితర కార్మిక సంఘాలు శనివారం ప్రచారంలో నిమగ్నమయ్యాయి. స్పెషల్ డ్రైవ్‌ను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందని జేఏసీ నేత ఏ.సత్తిరెడ్డి తెలిపారు. ఆటోమీటర్ ట్యాంపరింగ్, పరిమితికి మించిన ప్రయాణికుల తరలింపు, డ్రైవింగ్ లెసైన్సు లేకుండా ఆటోలు నడపడం, ప్రయాణికులపై దౌర్జన్యం, నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేయడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలపై ఈ నెల 16 నుంచి పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సంగతి విదితమే.