హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో ఆటో రిక్షా ఆగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానా మొత్తాన్ని రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 108 కి వ్యతిరేకంగా గ్రేటర్‌లోని అన్ని ఆటో సంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపున్విడంతో మంగళవారం అర్థరాత్రి నుంచి ఎక్కడి ఆటోలు అక్కడే నిలిచిపోయాయి. అన్నిరకాల వాహనాలు కలుపుకొని గ్రేటర్‌లో మొత్తం లక్షా 60 వేల వాహనాలు రోడ్డెక్కలేదు.
సుమారు 80 వేల ప్రయాణికుల ఆటోలు, మరో 30 వేల విద్యార్థుల ఆటోలు, 20 వేల వరకు స్కూల్ ఓమ్ని వ్యాన్‌లు, మరో 30 వేల వస్తురవాణా వాహ నాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి. నిరుపేద డ్రైవర్ల నడ్డివిరిచే విధంగా ఉన్న 106 జీవోను వెంటనే రద్దు చేయాలని, ఈ చలానా పద్ధతికి స్వస్తి చెప్పాలనే ప్రధాన డిమాండ్లతో ఆటోసంఘాలు నిరవధిక సమ్మెకు దిగాయి. మరోవైపు అక్కడక్కడ రోడ్డెక్కిన ఆటోలను యూనియన్ నేతలు అడ్డుకుంటున్నారు.
మహానగరంలో ఏ వాహనమైన స్టాప్ లైన్ దాటికే రూ. వెయ్యి జరిమానా చెల్లించాలంటూ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారుతున్నాయి. రోజంతా రెక్కాడితే గానీ రూ. అయిదు వందల సంపాదించటం గగనంగా ఉన్న తాము స్టాప్‌లైన్ దాటితే వెయ్యిరూపాల జరిమానా ఎలా కడతామంటూ పలు ఆటోడ్రైవర్ల యూనియన్లు గతంలోనే నిరసన వ్యక్తం చేశాయి. అయితే సర్కారు ఆదేశాలను వెంటనే సవరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో పలు పాఠశాలలు సెలవును కూడా ప్రకటించాయి. ఆటోల బంద్తో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.