సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో నమోదైన ఆటో రిక్షాలను మాత్రమే ఓలా, ఉబెర్‌లలో అనుమతించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. బయటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగరంలో తిరగడానికి అనుమతించబోమన్నారు. ఇతర ప్రాంతాల్లో నమోదైన ఆటోరిక్షాలు ఓలా, ఉబెర్ సంస్థలతో అనుసంధానమై నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, దీంతో తమ ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయంటూ ఆటో కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు నగర ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు రవాణాశాఖలో టీఎస్ 09 నుంచి టీఎస్ 13 వరకు గ్రేటర్ పరిధిలో నమోదైన ఆటోలను మాత్రమే నడపాలని అధికారులు సూచించారు. ఈ సిరీస్ ఆటోలు మినహాయించి మిగతా సిరీస్‌లో కనిపించే ఆటోలకు అనుమతి ఉండబోదని చెప్పారు. అలాంటి ఆటోలపై జరిమానాలు విధించనున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను కూడా ఓలా, ఉబెర్‌లకు అనుసంధానమై నడిపేందుకు అనుమతించడంపై అధికారులు అభ్యంతరం తెలిపారు.
ఏ నిబంధనల మేరకు వాటిని అనుమతించారో స్పష్టం చేయాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరారు. ఇలాంటి ప్రైవేట్ ద్విచక్ర వాహనాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వాహనాల వేగ నియంత్రణపైనా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్టీఏ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment