స్మృతి ఇరానీ, కపిల్ సిబల్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల నాయకులు వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను టార్గెట్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నారంటూ స్మృతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలాంటి వాటిని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. స్మృతి ఇరానీ ఆరోపణలకు స్పందించిన కపిల్ సిబల్ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్‌బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధానికి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ‘సమాచార శాఖ మంత్రి ప్రెస్‌మీట్లు పెడతారు గానీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలతో ప్రధానికున్న సంబంధాల గురించి అడగరు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం’ అంటూ ఎద్దేవా చేశారు. ముందు సీబీఎస్‌ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికారు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ, మీడియాలో వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ స్మృతి పలు ఆరోపణలు చేశారు. ‘మనీల్యాండరింగ్‌కు పాల్పడిన వ్యక్తి నుంచి రూ. 45.21 కోట్ల విలువైన భూమిని కపిల్ సిబల్ కేవలం లక్ష రూపాయలకే కొన్నారు. సిబల్, ఆయన భార్య గ్రాండ్ కాసిలా కంపెనీ యజమానులుగా ఉన్నారు. ఈ కంపెనీ కోసం వారు వడ్డీ లేని రుణాలు పొందా’రని అన్నారు. కంపెనీ పేరు మీద ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత విలువ ఒక్కసారిగా రూ. 89 కోట్లకు చేరింది. ఈవిధంగా విలువ రెండింతలవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం పీయూష్ గోయల్ అనే వ్యాపారిపై అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది. గోయల్ నుంచే కపిల్ సిబల్ ఈ కంపెనీని కొనుగోలు చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment