
రాజీనామా చేసిన సివిల్ సర్వీస్ అధికారులు
సాక్షి, బెంగళూరు: పని ఒత్తిళ్లు ఓ వైపు.. కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నామనే ఆవేదన మరోవైపు వేధిస్తున్న కారణంగా సివిల్స్ సర్వీస్ అధికారులు తమ పదవులకు రాజీనామా చేయడం రాష్ట్రంలో సాధారణ విషయమైంది. ఐదు నెలల్లో ఒక ఐపీఎస్, మరో ఐఏఎస్ రాజీనామా చేయగా, ఒక ఐఎఫ్‌ఎస్ (అటవీ) అధికారి ఏకంగా ఆత్మహత్యే చేసుకున్నారు. దీంతో అఖిల భారత సర్వీస్ అధికారుల్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. తరువాతి రాజీనామా ఏ అధికారిదోనని ఆ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విధానసౌధలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మధ్య ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
యువ ఐపీఎస్ అన్నామలైతో ఆరంభం
కర్ణాటకలో ’సింగం’గా పేరొందిన బెంగళూరు సౌత్ డీసీపీ కె.అన్నామలై ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు మే 28వ తేదీన రాజీనామా చేశారు. అప్పటి సీఎం హెచ్‌డీ కుమారస్వామిని స్వయంగా కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఉద్యోగం వదిలేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. అన్నామలై 2011 బ్యాచ్ యువ ఐపీఎస్ అధికారి. తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందినవారు. 2013లో కార్కళ ఏఎస్పీగా కెరీర్ మొదలుపెట్టారు. కుటుంబంతో గడపలేకపోతున్నానని, బంధువుల పెళ్లిళ్లకు, చావులకు కూడా హాజరు కాలేని పరిస్థితి ఉందని అప్పట్లో ఆవేదన వ్యక్తంచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతకుముందు జరిపిన హిమాలయాల పర్యటన నా కళ్లు తెరిపించిందని, జీవితం గురించి తెలుసుకోవడానికి ఈ యాత్ర దోహదపడిందని పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారి సెంథిల్ సంచలనం
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం. ఏళ్ల తరబడి అహోరాత్రులు చదివి సాధించిన సివిల్ సర్వీస్ ఉద్యోగాలను చివరికి పూచికపుల్లతోసమానంగా భావించి తప్పుకోవడం, ఆరునెలల్లో ఇలాంటి సంఘటనలు రెండు జరగడం గమనార్హం. విధుల్లో రాజీ పడలేకపోతున్నామంటూ అధికార దండాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తమిళనాడుకే చెందిన ఐఏఎస్ అధికారి, దక్షిణ కన్నడ జిల్లా కలెక్టర్ శశికాంత్ సెంథిల్ ఈ నెల 6వ తేదీన రాజీనామా సమర్పించారు. ప్రజాస్వామ్య విలువలు రాజీపడుతున్న ఈ సమయంలో ఐఏఎస్‌గా కొనసాగడం అనైతికమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యన ప్రకటించారు. అందరి జీవితాలను మెరుగుపరిచేందుకు నా కృషిని కొనసాగిస్తా’ అని సెంథిల్ తెలిపారు. 40 ఏళ్ల సెంథిల్ తమిళనాడులోని తిరుచీ్చకి చెందినవారు. 2009లో ఆయ న ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన రాజీనామా దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది.
ఐఎఫ్‌ఎస్ అవతార్‌సింగ్ ఆత్మహత్య!
కర్ణాటక అటవీ అభివృద్ధి మండలి సంస్థ ఎండీ, ఐఎఫ్‌ఎస్ అధికారి అవతార్ సింగ్ (52) ఈనెల 8వ తేదీన బెంగళూరు యలహంకలోని తన అపార్టుమెంటు ఫ్లాటులో ఉరివేసుకున్న స్థితిలో మరణించారు. ఇది ఆత్మహత్య కావచ్చని, తీవ్రమైన పని ఒత్తడి కారణంగా ఆయన ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. యలహంక న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హరియాణాకు చెందిన అవతార్ సింగ్ మరణానికి సంబంధించి విధుల పరంగా ఆయన కొద్ది రోజుల సెలవు తర్వాత ఈనెల 7వ తేదీన చేరారు. అంతలోనే ఇలా తీవ్ర నిర్ణయం తీసుకోవడం సహచర అధికారులను నిశ్చేషు్టలను చేసింది.
ప్రభుత్వం ఉలికిపాటు
ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ రాజీనామాతో కర్ణాటకలోని బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ ఎందుకు రాజీనామా చేశారు?, అసలు ఏం జరిగింది? ఇలాంటి సంఘటనలు తన ప్రభుత్వంలో మరోసారి జరగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment