పింప్రి, న్యూస్‌లైన్ : అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ ఏ నియోజక వర్గం ఎవరికో తెలియని పరిస్థితి నెలకొంది. అధికార పీఠం కోసం సీట్ల పేచీ కొలిక్కిరాలేదు. పశ్చిమ మహారాష్ట్రలోని ఐదు జిల్లాల్లో గతంలో చేసుకొన్న పొత్తులు తారుమారు అయ్యే సూచనలున్నాయి. కొందరు నాయకుల సీట్ల కోసం పార్టీలను సైతం మారే పరిస్థితులున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీల నాయకులు జంప్ జిలానీలుగా అవతారమెత్తారు.
శివసేన-బీజీపీకి సమాన బలం
షోలాపూర్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్లలల్లో కాషాయ కూ ట మిలో భాగంగా శివసేన 8, బీజేపీ 3 పోటీ చేస్తూ వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో శివసేన 8 స్థానాల్లో పోటీ చేయగా ఒక్కటీ గెలుచుకోలేకపోయింది. బీజేపీ రెండు స్థానాల్లో గెలిచి, ప్రస్తుతం అధిక సీట్లకు పోటీ చేయాలని భావిస్తోంది. ఈ జిల్లాలో పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నాయని పలువురి అభిప్రాయం. చోటా మోటా నాయకులు శివసేనలోకి వెళ్లిపోవడంతో ఈ సారి కొంత బలం పుంజుకొంది. గ్రా మీణ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి దాపురించింది. జిల్లాలో జంప్ జిలానీల మూలంగా శివసేన బలపడుతోంది.
సాంగ్లీలో సత్తా ఉన్న నాయకులే కరువు
సాంగ్లీ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ స్థానాలల్లో సొంతంగా పోటీ చేసి గెలిచే సత్తా అటు బీజేపీకి గానీ ఇటు శివసేనకు గానీ లేదు. కండబలం, ధన బలం ఉన్న అభ్యర్థులు లేరు. జిల్లాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. సాంగ్లీ నుంచి సంభాజీ పవార్, జత్ నుంచి ప్రకాష్ శేండగే, మిరజ్ నుంచి సురేష్ ఖాడే ఉన్నారు. శివసేనకు ఇక్కడ అంత బలం లేదు. శివసేనకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి ఉంది.
పుంజుకొంటున్న బీజేపీ
సతారా జిల్లాలోని 8 నియోజక వర్గాలల్లో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నాయకులు బీజేపీలో చేరడంతో జిల్లాలో బీజేపీ బలం పుంజుకుంది. మాజీ ఎమ్మెల్యే దిలీప్ యేలాగావ్కర్, సదాశివ్ సత్కాల్, రవీంద్ర సరామణే ఇతరుల రాకతో బీజేపీ కదం తొక్కుతుండగా, శివసేనకు 5 నియోజక వర్గాలలో అభ్యర్థుల కరువు నెలకొంది.
కూటమితో ఫలితం
అహ్మద్‌నగర్ జిల్లాలో మొత్తం 12 నియోజక వర్గాలల్లో మహా కూటమి లో భాగంగా గతంలో 7 నియోజక వర్గాలు అకోలా, సంగంనేర్, కోపర్‌గావ్, శ్రీరాంపూర్, శివ్డీ, నగర్, పార్‌నెర్ శివసేన ఆధీనంలో ఉండగా, రాహూరీ, శ్రీ గోందా, కర్జత్-జాంఖేడ్, శేవ్‌గావ్, నేవాసా నియోజక వర్గాలు బీజేపీకి ఉన్నాయి. జిల్లాలో సమానంగా పార్టీల బలం ఉంది. కూటమి ద్వారా పోటీ చేస్తే అటు బీజేపీ, శివసేనకు ప్రయోజనం ఉంటుంది. బబన్‌రావు పాచ్‌పుతే బీజేపీ లోకి రావడం ఆ పార్టీకి కొంత కలసివచ్చే అవకాశం ఉంది.
పుణేలో ఒంటరిగానైనా సరే
పుణే జిల్లాలో గతంలో బీజేపీ కసబాపేట్, శివాజీనగర్, పర్వతి, పింప్రి, మావల్, శిరూర్, దౌండ్, ఖడక్‌వాస్లా మొత్తం 8 నియోజక వర్గాల నుంచి పోటీ చేయగా, శివసేన వడగావ్ శేరి, కోత్‌రోడ్, పుణే కంటోన్మెంట్, హడప్సర్, ఖేడ్, ఆంబేగావ్, జున్నర్, భోర్, పురంధర్, బారామతి, ఇందాపూర్, చించ్‌వడ్, బోసిరి మొత్తం 13 నియోజక వర్గాలలో పోటీ చేసింది. సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరిగా పార్టీలు బరిలోకి దిగితే.. కొందరు నాయకులు బీజేపీ గూటికి చేరే అవకాశం ఉంది. దీని ద్వారా బీజేపీ బలం పెంచుకునే యోచనలో ఉంది.
కొల్హాపూర్ శివసేనదే హవా
కొల్లాపూర్ జిల్లాలో గతంలో 10 నియోజక వర్గాలలో 8 స్థానాలకు గాను శివసేన పోటీ చేయగా, రెండు స్థానాలకు బీజేపీ పోటీ చేసింది. ఇచ్ఛల్ కరంజి నుంచి ప్రస్తుతం బీజేపీ నాయకుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొల్హాపూర్, కర్‌వీర్, కాగల్, చందఘడ్, రాధనగరి, శిరోల్, హత్ కణంగలే, షాహువాడి నుంచి శివసేన పోటీ చేయగా, కొల్హాపూర్, కర్‌వీర్, మత్ కణంగల్ మాత్రమే శివసేన గెలుపొందింది. ఈ ప్రాంతాలలో శివసేన పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ బలంగా ఉన్నారు. స్వభిమాన్ శేత్‌కారి సంఘటన... శివసేనకు చెందిన చందఘడ్, రాధనగరి, శిరోల్ స్థానాలకు ఎసరు పెట్టనుంది.
ఏ సెగ్మెంట్‌లో ఎవరికెంత బలం..?
Published Sun, Sep 21 2014 11:17 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
Advertisement
Advertisement