ప్రధాని ఇంటి కంటే.. సోనియా ఇల్లే పెద్దది!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసం ఉండే నెం.7 రేస్ కోర్స్ రోడ్డు అంటే చాలా పెద్దదని అనుకుంటాం కదూ. కానీ, అది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసమైన 10 జన్‌పథ్ కంటే చిన్నదేనట. సమాచార హక్కు ద్వారా చేసిన దరఖాస్తుతో ఈ విషయం వెల్లడైంది. ఆ మాటకొస్తే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీల ఇళ్లు మాత్రమే 10 జన్‌పథ్ కంటే పెద్దగా ఉంటాయి. ప్రధాని సహా అందరికీ వాళ్ల పదవులను బట్టి అధికారిక నివాసాలుగా మాత్రమే ఆయా భవనాలను కేటాయించగా, సోనియాగాంధీకి మాత్రం పార్లమెంటు సభ్యురాలి హోదాతో సంబంధం లేకుండానే 10 జన్‌పథ్ కేటాయించారు.
సోనియా నివాసం మొత్తం 15,181 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ప్రధాని నివాసం మాత్రం 14,101 చదరపు మీటర్లు మాత్రమే. రాష్ట్రపతి భవన్ మాత్రం అన్నింటికంటే పెద్దగా.. 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలో మరే దేశాధినేతల నివాసం చూసినా దీనికంటే తక్కువే ఉన్నాయట. 6 మౌలానా ఆజాద్ రోడ్డులోని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాసం 26,333.5 చదరపు మీటర్లు ఉంది. ఈ వివరాలన్నీ దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌లో ఉంటున్నారు. ఆ భవనం విస్తీర్ణం 5,022 చదరపు మీటర్లు. ప్రియాంకా గాంధీ ఉండే 35 లోదీ ఎస్టేట్ బంగ్లా విస్తీర్ణం 2,765 చదరపు మీటర్లు.