official residences
-
అధికారిక బంగ్లాలకు అఖిలేష్, ములాయం బై..
సాక్షి, లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎంలు అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ తమ అధికారిక బంగ్లాలను గురువారం ఖాళీ చేశారు. తొలుత వీరిద్దరూ బంగ్లాలను ఖాళీ చేసేందుకు తమకు రెండేళ్ల సమయం కావాలిన కోరిన సంగతి తెలిసిందే. యూపీ మాజీ సీఎంలు అందరూ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్జీవో లోక్‌ప్రహరి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన అఖిలేష్ తాను ఉండేందుకు మరో ఇల్లు లేదని అశక్తత వ్యక్తం చేశారు. మరోవైపు భారీ సెక్యూరిటీ, తన కోసం వచ్చే అతిధులకు సరిపోయే ఇల్లు తనకు లేదంటూ ములాయం సింగ్ యాదవ్ అధికారిక బంగ్లాలను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. అయితే వీరి వాదనలను యూపీ అధికార యంత్రాంగం ఖాతరుచేయకపోవడంతో గురువారం ఇరువురు నేతలూ ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేశారు. ఇక మాజీ సీఎంలు మాయావతి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్, ఎన్డీ తివారీలు తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంది. -
ఇక వారికీ కొత్త ఇళ్లు
సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సిటీ పోలీస్ కమిషనర్లకూ... ♦ చివరకు సీఎం కార్యదర్శులకూ ♦ కొత్త అధికారిక నివాసాలు ♦ కేసీఆర్ దంపతుల శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. అసెంబ్లీ, మండలికి అధునాతన భవనసముదాయాలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో అధికారిక నివాసాలు... బంగారు తెలంగాణలో కొత్త నిర్మాణాలకు కొదవే లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్న సీఎం కేసీఆర్... ఎవరికీ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎం కార్యదర్శులు, ఇంటెలిజెన్స్ ఐజీ, నగర పోలీసు కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో ఉన్నవారికీ అధునాతన, విలాసవంతమైన అధికారిక నివాసాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయిం చారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారిక నివాసాలున్నాయి. అవన్నీ పాతబడ్డాయని, ఉన్నతాధికారులకు కొత్త తరహా ఇళ్లు ఉండాల్సిందేనని బలంగా పేర్కొంటున్న సీఎం వారికీ వరాలు ప్రకటించేశారు. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ ఆ పనిలో పడింది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న భవనం వెనకవైపు 13-15 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. పంజగుట్టలోని అధికారుల పాత క్వార్టర్లను కూల్చి కొత్తవాటిని నిర్మించనున్నారు. దీనికి చేరువలోనే సీఎంకు కొత్త అధికారిక నివాస గృహం, క్యాంపు కార్యాలయం, మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఐఏఎస్ అధికారుల సంఘశఢ కార్యాలయం ఉన్న ప్రాంతంతోపాటు కొన్ని పాత క్వార్టర్లను తొలగించి 8.9 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. వేయిమంది కూర్చునే సామర్థ్యంతో పెద్ద సమావేశ మందిరం, 200 కార్లు నిలిపే పార్కింగ్ సముదాయం ఇందులో ఉన్నాయి. ఈ భవనాలకు శనివారం కేసీఆర్ దంపతులు శంకుస్థాపన చేశారు. -
ప్రధాని ఇంటి కంటే.. సోనియా ఇల్లే పెద్దది!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాసం ఉండే నెం.7 రేస్ కోర్స్ రోడ్డు అంటే చాలా పెద్దదని అనుకుంటాం కదూ. కానీ, అది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసమైన 10 జన్‌పథ్ కంటే చిన్నదేనట. సమాచార హక్కు ద్వారా చేసిన దరఖాస్తుతో ఈ విషయం వెల్లడైంది. ఆ మాటకొస్తే.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీల ఇళ్లు మాత్రమే 10 జన్‌పథ్ కంటే పెద్దగా ఉంటాయి. ప్రధాని సహా అందరికీ వాళ్ల పదవులను బట్టి అధికారిక నివాసాలుగా మాత్రమే ఆయా భవనాలను కేటాయించగా, సోనియాగాంధీకి మాత్రం పార్లమెంటు సభ్యురాలి హోదాతో సంబంధం లేకుండానే 10 జన్‌పథ్ కేటాయించారు. సోనియా నివాసం మొత్తం 15,181 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, ప్రధాని నివాసం మాత్రం 14,101 చదరపు మీటర్లు మాత్రమే. రాష్ట్రపతి భవన్ మాత్రం అన్నింటికంటే పెద్దగా.. 320 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రపంచంలో మరే దేశాధినేతల నివాసం చూసినా దీనికంటే తక్కువే ఉన్నాయట. 6 మౌలానా ఆజాద్ రోడ్డులోని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ నివాసం 26,333.5 చదరపు మీటర్లు ఉంది. ఈ వివరాలన్నీ దేవాశీష్ భట్టాచార్య అనే వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌లో ఉంటున్నారు. ఆ భవనం విస్తీర్ణం 5,022 చదరపు మీటర్లు. ప్రియాంకా గాంధీ ఉండే 35 లోదీ ఎస్టేట్ బంగ్లా విస్తీర్ణం 2,765 చదరపు మీటర్లు. -
అజిత్, అజహర్ ఇళ్లకు కరెంట్ కట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక నివాసాలను ఖాళీ చేయకుండా మొండికేస్తున్న కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీల నివాసాలకు కేంద్రం విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసింది. 30 ఇళ్లకు సరఫరాలు నిలిపివేయగా అందులో అజిత్‌సింగ్, జితేంద్ర సింగ్, మహమ్మద్ అజహరుద్దీన్ నివాసాలు కూడా ఉన్నాయి. అధికారిక నివాసాలను ఖాళీచేయాలని వారికి అనేకసార్లు విన్నవించినా, తగినంత సమయమిచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్డీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్, నీటి నిలిపివేత తర్వాత కొందరు ఖాళీచేశారని అయితే ఇంకా 15 మంది ఖాళీ చేయాల్సి ఉందని చెప్పారు. దీనికి సంబంధించి లోక్‌సభ హౌసింగ్ కమిటీకి కూడా నివేదిక సమర్పించామని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన పార్లమెంటు సభ్యులు తమ క్వార్టర్లను ఖాళీ చేయకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఇళ్లు కేటాయించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాలుగోతేదీ లోపు ఇళ్లు ఖాళీచేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ గతంలోనే నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు స్పందించని వారి నివాసాలకు ప్రస్తుతం విద్యుత్, నీటి సరఫరాలు నిలిపివేశారు. -
లోకాయుక్త పంజా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోకాయుక్త మళ్లీ అవినీతిపరుల పాలిట సింహ స్వప్నమైంది. రాష్ట్రంలో వివిధ చోట్ల అధికారులు శనివారం ఏక కాలంలో ఎనిమిది మంది అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. బెంగళూరుతో పాటు మైసూరు, బెల్గాం, చిక్కబళ్లాపురం, చిత్రదుర్గ, గుల్బర్గ, మండ్య, బీదర్‌లలో ఈ సోదాలు జరిగాయి. వేకువ జాము నుంచే అవినీతి అధికారులతో పాటు వారి బంధువులు, స్నేహితుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. బృహత్ బెంగళూరు మహా నగర పాలికె చీఫ్ ఇంజనీర్ నాగరాజ్‌కు చెందిన కనకపుర రోడ్డులోని కరిష్మా లేఔట్లో నిర్మించిన రాజ సౌధం లాంటి భవంతిలో సోదాలు జరిగాయి. లోకాయుక్త ఎస్పీ మహేశ్, డీఎస్పీలు నారాయణ్, పాలాక్షయ్యల సారథ్యంలో జరిగిన సోదాల్లో కోట్ల నగదు, ఏసీ వాహనాలను కనుగొన్నారు. ఆయనకున్న ఆదాయ వనరుల మేరకు రూ.2 కోట్ల ఆస్తులు ఉండాలి. అదనంగా రూ.కోటీ 60 లక్షల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. బీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్‌కు చెందిన ఇక్కడి మైకో లేఔట్‌లోని నివాసంలో జరిగిన సోదాల్లో అక్రమ స్థిర, చరాస్తులతో పాటు షేర్లు, నగదు లభ్యమయ్యాయి. ఆయన వాస్తవ ఆదాయం రూ.60 లక్షలుకాగా ప్రాథమిక సోదాల్లో మరో రూ.2.06 కోట్ల ఆస్తులు బహిర్గతమయ్యాయి. బీడీఏలోనే అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేస్తున్న నరసింహమూర్తి కూడా లోకాయుక్త వలలో పడ్డారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాల తాలూకు రసీదులు లభ్యమయ్యాయి. ఆయన ఆదాయం రూ.30 లక్షలుగా అంచనా వేయగా, ప్రాథమిక పరిశీలనలో రూ.కోటి పైగా విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలింది. విద్యా శాఖలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న కలసేగౌడ వద్ద లెక్కకు తేలని రూ.65 లక్షల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు. కేఎస్ఆర్టీసీలో విద్యుత్ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్న రామకృష్ణా రెడ్డి వద్ద రూ.1.36 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆయన వాస్తవ ఆదాయం రూ.63 లక్షలుగా అంచనా వేశారు. బెల్గాంలోని ఎస్కాంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేస్తున్న విఠల సవదత్తి ఆదాయాన్ని రూ.63 లక్షలుగా లెక్కించిన అధికారులు, సోదాల్లో లెక్కకు తేలని రూ.కోటీ తొమ్మిది లక్షల ఆస్తులను కనుగొన్నారు. చిత్రదుర్గలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శ్రీనివాసయ్య వద్ద రూ.2.63 కోట్ల విలువైన అక్రమ సంపద లభ్యమైంది. ఇందులో బంగారు ఆభరణాలు, ఏసీ వాహనాలు, పలు చోట్ల కొనుగోలు చేసిన నివేశనాలు ఉన్నాయని లోకాయుక్త అధికారులు తెలిపారు. బీదర్‌లో నీటి పారుదల శాఖకు చెందిన కారంజి ప్రాజెక్టులో పని చేస్తున్న సుభాష్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.75 లక్షల విలువైన అక్రమ ఆస్తులు లభ్యమయ్యాయి.