సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోకాయుక్త మళ్లీ అవినీతిపరుల పాలిట సింహ స్వప్నమైంది. రాష్ట్రంలో వివిధ చోట్ల అధికారులు శనివారం ఏక కాలంలో ఎనిమిది మంది అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులను కనుగొన్నారు. బెంగళూరుతో పాటు మైసూరు, బెల్గాం, చిక్కబళ్లాపురం, చిత్రదుర్గ, గుల్బర్గ, మండ్య, బీదర్‌లలో ఈ సోదాలు జరిగాయి. వేకువ జాము నుంచే అవినీతి అధికారులతో పాటు వారి బంధువులు, స్నేహితుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
బృహత్ బెంగళూరు మహా నగర పాలికె చీఫ్ ఇంజనీర్ నాగరాజ్‌కు చెందిన కనకపుర రోడ్డులోని కరిష్మా లేఔట్‌లో నిర్మించిన రాజ సౌధం లాంటి భవంతిలో సోదాలు జరిగాయి. లోకాయుక్త ఎస్‌పీ మహేశ్, డీఎస్‌పీలు నారాయణ్, పాలాక్షయ్యల సారథ్యంలో జరిగిన సోదాల్లో కోట్ల నగదు, ఏసీ వాహనాలను కనుగొన్నారు. ఆయనకున్న ఆదాయ వనరుల మేరకు రూ.2 కోట్ల ఆస్తులు ఉండాలి. అదనంగా రూ.కోటీ 60 లక్షల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.
బీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్‌కు చెందిన ఇక్కడి మైకో లేఔట్‌లోని నివాసంలో జరిగిన సోదాల్లో అక్రమ స్థిర, చరాస్తులతో పాటు షేర్లు, నగదు లభ్యమయ్యాయి. ఆయన వాస్తవ ఆదాయం రూ.60 లక్షలుకాగా ప్రాథమిక సోదాల్లో మరో రూ.2.06 కోట్ల ఆస్తులు బహిర్గతమయ్యాయి.
బీడీఏలోనే అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేస్తున్న నరసింహమూర్తి కూడా లోకాయుక్త వలలో పడ్డారు. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాల తాలూకు రసీదులు లభ్యమయ్యాయి. ఆయన ఆదాయం రూ.30 లక్షలుగా అంచనా వేయగా, ప్రాథమిక పరిశీలనలో రూ.కోటి పైగా విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు తేలింది.
విద్యా శాఖలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న కలసేగౌడ వద్ద లెక్కకు తేలని రూ.65 లక్షల విలువైన అక్రమ ఆస్తులను కనుగొన్నారు.
కేఎస్‌ఆర్‌టీసీలో విద్యుత్ విభాగంలో ఏఈఈగా పని చేస్తున్న రామకృష్ణా రెడ్డి వద్ద రూ.1.36 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆయన వాస్తవ ఆదాయం రూ.63 లక్షలుగా అంచనా వేశారు.
బెల్గాంలోని ఎస్కాంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పని చేస్తున్న విఠల సవదత్తి ఆదాయాన్ని రూ.63 లక్షలుగా లెక్కించిన అధికారులు, సోదాల్లో లెక్కకు తేలని రూ.కోటీ తొమ్మిది లక్షల ఆస్తులను కనుగొన్నారు.
చిత్రదుర్గలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న శ్రీనివాసయ్య వద్ద రూ.2.63 కోట్ల విలువైన అక్రమ సంపద లభ్యమైంది. ఇందులో బంగారు ఆభరణాలు, ఏసీ వాహనాలు, పలు చోట్ల కొనుగోలు చేసిన నివేశనాలు ఉన్నాయని లోకాయుక్త అధికారులు తెలిపారు.
బీదర్‌లో నీటి పారుదల శాఖకు చెందిన కారంజి ప్రాజెక్టులో పని చేస్తున్న సుభాష్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.75 లక్షల విలువైన అక్రమ ఆస్తులు లభ్యమయ్యాయి.
లోకాయుక్త పంజా
Published Sun, Mar 30 2014 2:33 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement