ఇక వారికీ కొత్త ఇళ్లు
సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సిటీ పోలీస్ కమిషనర్‌లకూ...
♦ చివరకు సీఎం కార్యదర్శులకూ
♦ కొత్త అధికారిక నివాసాలు
♦ కేసీఆర్ దంపతుల శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. అసెంబ్లీ, మండలికి అధునాతన భవనసముదాయాలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో అధికారిక నివాసాలు... బంగారు తెలంగాణలో కొత్త నిర్మాణాలకు కొదవే లేకుండా ప్రణాళిక రూపొందిస్తున్న సీఎం కేసీఆర్... ఎవరికీ తక్కువ కాకుండా చూసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీఎం కార్యదర్శులు, ఇంటెలిజెన్స్ ఐజీ, నగర పోలీసు కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో ఉన్నవారికీ అధునాతన, విలాసవంతమైన అధికారిక నివాసాలు నిర్మించి ఇవ్వాలని నిర్ణయిం చారు. ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అధికారిక నివాసాలున్నాయి. అవన్నీ పాతబడ్డాయని, ఉన్నతాధికారులకు కొత్త తరహా ఇళ్లు ఉండాల్సిందేనని బలంగా పేర్కొంటున్న సీఎం వారికీ వరాలు ప్రకటించేశారు.
ఈమేరకు రోడ్లు భవనాల శాఖ ఆ పనిలో పడింది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న భవనం వెనకవైపు 13-15 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. పంజగుట్టలోని అధికారుల పాత క్వార్టర్లను కూల్చి కొత్తవాటిని నిర్మించనున్నారు. దీనికి చేరువలోనే సీఎంకు కొత్త అధికారిక నివాస గృహం, క్యాంపు కార్యాలయం, మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఐఏఎస్ అధికారుల సంఘశఢ కార్యాలయం ఉన్న ప్రాంతంతోపాటు కొన్ని పాత క్వార్టర్లను తొలగించి 8.9 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. వేయిమంది కూర్చునే సామర్థ్యంతో పెద్ద సమావేశ మందిరం, 200 కార్లు నిలిపే పార్కింగ్ సముదాయం ఇందులో ఉన్నాయి. ఈ భవనాలకు శనివారం కేసీఆర్ దంపతులు శంకుస్థాపన చేశారు.