సోనియాజీ మీరు దిగిపోండి!
నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై ఆ పార్టీ పంజాబ్ నేత, అమృత్‌సర్ ఎంపీ అమరిందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైందని, ఆమె తప్పుకొని పార్టీ పగ్గాలను రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీకి అప్పగించాలని సూచించారు. సోనియా వయస్సు 70 ఏళ్లకు వచ్చిందని, ఆమె పనిచేసి నీరసించిపోయారని, కాబట్టి నాయకత్వ మార్పు అవసరమని పేర్కొన్నారు.
'1998 నుంచి నేను సోనియజీతో పనిచేస్తున్నాను. ఆమె మంచి నాయకురాలు. ఆమె ఇప్పుడు 70 ఏళ్లకు వచ్చారు. నేను 74 ఏళ్లు ఉన్నాను. కాబట్టి నూతన తరం ముందుకొచ్చేందుకు ఇదే సరైన సమయం. ఆమె దేశమంతా తిరిగి పనిచేస్తున్నారు. పనిభారంతో నీరసించిపోతున్నారు. మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఆమె (నాయకత్వ పగ్గాలు) ఇతరులకు అప్పగించాలని భావిస్తే అది సముచితమేనని నేను అనుకుంటున్నా' అని అమరిందర్ సింగ్ ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు.