సోనియా, రాహుల్ లబ్ధి పొందలేదు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ జవాబులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉదంతంపై ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ సమాధానాలు ఇచ్చింది. తరచూ అడిగే ప్రశ్న(ఎఫ్‌ఏక్యూ)లకు జవాబులంటూ తన వెబ్‌సైట్‌లో వీటిని పొందుపరచింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్(వైఐ) నుంచి పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆర్థికంగా ఎలాంటి లబ్ధీ పొందలేదని స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ ప్రచురణ సంస్థ అసోసియేట్ జర్నల్స్ ఆఫ్ ఇండియా(ఏజేఎల్)లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏర్పాటైన వైఐ రియల్ ఎస్టేట్ కంపెనీ కాదని స్పష్టం చేసింది.
పార్టీలు రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు లేవని ఎన్నికల కమిషన్ ఉత్తర్వును ఉదహరించింది. లాభాపేక్ష లేని కంపెనీ అయిన వైఐ డెరైక్టర్లు లేదా వాటాదారులుగా సోనియా, రాహుల్‌లు కంపెనీ నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందలేరంది. ఏజేఎల్ ఆస్తుల్లో ఒక్కపైసా కూడా వైఐకి బదిలీకాలేదని పేర్కొంది. ‘ఏజేఎల్ ఆస్తులను దక్కించుకోవడానికే వైఐని ఏర్పాటు చేశారనడం నిజం కాదు. ఏజేఎల్‌లో భారీ వాటాదారైన వైఐ.. ఆ కంపెనీ ఆస్తుల రక్షణ పెంచింది’ అని పేర్కొంది. ఏజేఎల్, వైఐ రెండూ వేరువేరు సంస్థలని, ఏజేఎల్ ఆస్తులు ఆ కంపెనీవిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. కుదేలైన ఏజేఎల్‌కు తమ పార్టీ రూ.90 కోట్ల రుణమివ్వడం సమంజసమేనంది.