విధి ఆడిన వింతనాటకం | sons begging to the mother  combustion | Sakshi
Sakshi News home page

విధి ఆడిన వింతనాటకం

Published Fri, Feb 9 2018 7:48 AM | Last Updated on Fri, Feb 9 2018 1:22 PM

sons begging to the mother  combustion - Sakshi

ఆసుపత్రిలో భిక్షాటన చేస్తున్న పిల్లలు

సాక్షి, చెన్నై : విధి ఆడిన నాటకంలో ఇద్దరు బాలురు అనాథలయ్యారు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి హఠాన్మరణం ఓ వైపు, తల్లిని వెంటాడుతున్న కేన్సర్‌ మహమ్మారి మరో వైపు వెరసి పుస్తకాలను పక్కనపెట్టి ముక్కుపచ్చలారని పసి వయస్సులోనే కూలీలుగా మారారు. జన్మనిచ్చిన తల్లిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. చివరకు తల్లి తనువు చాలించడంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు కూడా చేయించలేని ఆర్థిక దుస్థితితో తల్లడిల్లారు. బంధువులు, ఆప్తులు ముఖంచాటేయడంతో గత్యంతరం లేక ఆ ఇద్దరు భిక్షాటనకు దిగారు. తల్లి అంత్యక్రియలకు సాయం చేయండంటూ కన్నీటి పర్యంతంతో అభ్యర్థించారు. చివరకు మంచి హృదయాలు స్పందించడంతో తల్లికి ఎలక్ట్రిక్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. గురువారం దిండుగల్‌ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారకర  ఘటన వివరాలు...

దిండుగల్‌ జిల్లా ఎరియోడు సమీపంలోని మేట్టుపట్టికి చెందిన కాళియప్పన్‌ , విజయ దంపతులకు మోహన్‌ (14), వేల్‌ మురుగన్‌(13) అనే ఇద్దరు కుమారులు, కాళీశ్వరి కుమార్తె ఉన్నారు.  బంధువులు, ఆప్తులతో ఆనందకరంగా సాగిన ఈ కుటుంబంలో తొమ్మిదేళ్ల క్రితం విషాదకర çఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో హఠాత్తుగా కాళియప్పన్‌ మరణించడంతో కుటుంబ భారం విజయకు బరువైంది. కుటుంబ పెద్ద దూరమైనా, ఆప్తులు ముఖం చాటేసినా,  రెక్కల కష్టంతో పిల్లల్ని చదివించాలని తపన పడింది. తన స్తోమత మేరకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినా, కాల క్రమేనా విధి ఆడిన నాటకం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.  పుస్తకాలు చేతబట్టాల్సిన కుమారుల్ని కూలి పనికి, రక్తం పంచుకుని పుట్టిన కుమార్తె అనాథ ఆశ్రమానికి పరిమితం చేయాల్సిన పరిస్థితి విజయకు ఏర్పడింది. 

కేన్సర్‌ మహమ్మారి : విజయను కేన్సర్‌ మహమ్మారి తాకింది. బ్రెస్ట్‌ కేన్సర్‌తో తల్లి బాధ పడుతుండడంతో ఆ ఇద్దరు బాలుర కష్టాలు మరింత జఠిలమయ్యాయి. ఇద్దరు మగ పిల్లలు ఎలాగైనా బతక గలరని భావించిన విజయ, తన కుమార్తెను మాత్రం రక్షించాలని ఆ దేవుడ్ని వేడుకుంది. ఇందుకు తగ్గట్టు ఒట్టన్‌ చత్రంలోని ఓ ఆశ్రమ వర్గాలు కాళీశ్వరి ఆలనాపాలన చూసుకునేందుకు సిద్ధమయ్యారు. క్రమంగా కేన్సర్‌ తీవ్రత పెరగడంతో ఆస్పత్రికి వెళ్ల లేనంతగా , మంచానికే పరిమితం అయ్యే స్థాయికి విజయ పరిస్థితి చేరింది.  తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్ల లేని పరిస్థితుల్లో బంధువులు, ఆప్తుల్ని కలిసి వేడుకున్నారు. వారిలో మాన వత్వం కొరవడింది. ఇక, చేసేది లేక ఇరుగు పొరుగున ఉన్న మానవతావాదుల సాయంతో దిండుగల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మకు వెన్నంటి ఉంటూ ఆ ఇద్దరు పిల్లలు సాయం అందించారు. వైద్యులు సైతం విజయకు వైద్య పరీక్షలు అందించారు. అయితే, ఫలితం శూన్యం.

భిక్షాటనతో : చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండా, సర్కారు వారి వైద్యంతో కాలం నెట్టుకు వచ్చిన ఆ ఇద్దరు పిల్లల్లో గురువారం ఉదయం పిడుగు పడ్డట్టు పరిస్థితి మారింది. విజయ ఇక, లేదన్న సమాచారంతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆస్పత్రిలోని వార్డులో మంచం మీద విగతజీవిగా పడి ఉన్న తల్లి మృతదేహం వద్ద బోరున విలపించారు. వీరి వేదనను చూసిన పక్కనే మరో మంచం మీదున్న మరో రోగి కుటుంబీకులు, ఆ పిల్లల బంధువులకు సమాచారం అందించారు.  కనీసం ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చేందుకు సైతం బంధువులు, ఆప్తులు రాలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో తమ తల్లికి ఎలా అంత్యక్రియలు చేయగలమన్న వేదనతో ఆ మంచం వద్దే కన్నీటి పర్యంతంతో నిలుచుండి పోయారు.

చివరకు ఆ ఇద్దరు తమ తల్లికి అంత్యక్రియలు జరిపించేందుకు సహకరించాలని ఆస్పత్రిలో ఉన్న ఇతర రోగుల కుటుంబీకుల వద్ద చేతులు చాపక తప్పలేదు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ భిక్షాటనకు దిగారు. మానవతావాదులు, అనేక మంది రోగులు తమ వద్ద ఉన్న తలా పదో, ఇరవయ్యే ఇచ్చి సాయం అందించే పనిలో పడ్డారు. ఈ ఇద్దరు పిల్లలు బిక్షాటన చేస్తుండడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. తాము సైతం అంటూ సాయం అందించడమే కాదు, ఆస్పత్రి అధికారి మాలతి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ఆమె అంత్యక్రియలకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆ తదుపరి స్పత్రి వర్గాలు మృతదేహాన్ని దిండుగల్‌ ప్రభుత్వ ఎలక్ట్రిక్‌ శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. తల్లిని, తండ్రిని కోల్పోయి, చెల్లిని ఆశ్రమంలో వదలి పెట్టిన ఈ ఇద్దరు బాలురు అనాథలుగా గమ్యం ఎటో అన్న ట్టు ఆస్పత్రి ఆవరణలో కూర్చుని ఉండడం మనస్సున్న హృదయాల్ని కలచివేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement