సాక్షి, చెన్నై: ఉన్నట్టుండి ఆ ఇంటి తలుపులు.. కిటికీలు పేలాయ్. అద్దాలు పగిలాయ్. బాంబు పేలిందేమో అనుకుంటే అలాంటిదేమీ లేదు. అంతుబట్టని ఈ హఠాత్పరిణామంతో ఆ ఇంట్లో వాళ్లు భయంతో బయటకు పరుగులు తీశారు. ఇదేదో హర్రర్ సినిమాలోని దృశ్యం కాదు. ఆదివారం అర్ధరాత్రి చెన్నైలోని వేళచ్చేరిలో చోటుచేసుకున్న యథార్థ ఘటన. ఇందుకు గల కారణాలేమిటో తెలియకపోవడంతో ఆ ఇంటికి ‘విచిత్ర నివాసం’ అని పేరు పెట్టేశారు. వివరాలివీ.. వేళచ్చేరిలో మారి ముత్తు, మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి నిద్రకు ఉపక్రమించిన కాసేటికి హఠాత్తుగా ఇంట్లోని బెడ్ రూమ్‌లు, ఇతర గదులతో పాటు ఇంటి ప్రధాన ద్వారం, బాత్రూం తలుపులు పేలిపోయాయి.
కిటికీలు సైతం టపటపమని కొట్టుకుంటూ పేలడం, అద్దాలు పగలడంతో ఆ దంపతులు బెంబెలెత్తి పోయారు. పెద్ద శబ్దం రావడంతో ఇరుగు పొరుగు వారు సైతం పరుగులు తీశారు. దొంగలు చొరబడ్డారా లేక దెయ్యం చేష్టలా అనుకుంటూ ఆందోళన చెందుతున్న ఆ ఇంట్లోని దంపతులను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆ ఇంటికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ సురక్షితంగానే ఉండటం, పేలుడు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ పేలుడు ఎలా జరిగిందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కారణాలను కనుగొనేందుకు నిపుణుల్ని రంగంలోకి దించారు. ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ దంపతులు భయంతో బంధువు ఇంటికి మకాం మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment