భారత్‌లో ఓ కొరియా వాసి ఆవేదన | South Korean Man Gets Leave India Notice | Sakshi
Sakshi News home page

దేశాన్ని వదిలి వెళ్లిపో!

Published Sat, Feb 24 2018 4:28 PM | Last Updated on Sat, Feb 24 2018 5:04 PM

South Korean Man Gets Leave India Notice - Sakshi

లక్నో : భారతదేశ సంస్కృతి , సంప్రదాయాలు నచ్చి, ఇక్కడే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న కొరియా వాసికి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 15 లోపు దేశం విడిచి పోవాలంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఆయన తన డాక్యుమెంట్‌లో భారతీయ పౌరుడిగా పేర్కొనడమే. కానీ తానేమీ తప్పు చేయలేదని, భాష  సరిగ్గా తెలియక పోవడం వల్ల అధికారులే ఈ తప్పుకు ఒడిగట్టారని, తాను ఈ తప్పు సరిదిద్దుకోవడానికి చాలా కాలం నుంచే ప్రయత్నిస్తున్నానని కొరియా వాసి చెబుతున్నాడు. 

వివరాల్లోకి వెళ్తే..  కొరియా వ్యక్తి బియ్యుంగ్ కిల్ కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చాడు. కొంతకాలం పాటు చెన్నైలో పనిచేశాడు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. ఇక ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. లక్నోను తన వ్యాపార ప్రదేశంగా ఎంచుకున్నాడు. దీనికోసం 2012లో బిజినెస్‌ వీసా కూడా పొందాడు. బారాబంకి జిల్లా ఫతేపుర్‌ మండలంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో కొరియా వాసిని అధికారులు, భారతీయ పౌరుడిగా పేర్కొన్నారు. ఒక కొరియా వాసిని భారతీయ పౌరుడిగా ఎలా నమోదుచేస్తారంటూ.. ఈ భూమిని అతను అక్రమంగా పొందాడని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు బారాబంకి ఎస్పీ అనిల్‌ కుమార్‌ సింగ్‌ నోటీసులు జారీచేశారు. అయితే అది అక్కడ పనిచేసే సిబ్బంది వల్ల జరిగిన తప్పిదమని, భాష తెలియక వారు అలాచేశారని కొరియా వాసి చెబుతున్నాడు. దాన్ని సరిదిద్దడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు.  

కొరియా వాసి తాను కొన్న ఆ ప్రాపర్టీలో పాఠశాలను నిర్మించాడు. తన సంపదంతా ధారపోసి దాన్ని ఏర్పాటుచేశాడు. కానీ ఆ భూమి ఇప్పుడు ఇరకాటంలో పడింది. స్కూల్‌ నిర్మించిన ఆ ప్రాపర్టీలోనే కొరియా వాసి, ప్రధాన మంత్రి కౌశల్య యోజనలో భాగమైన స్కిల్‌ ఇండియా తరగతులు నిర్వహించాలని బియ్యుంగ్ కిల్ నిర్ణయించాడు. వెంటనే అక్కడి యువకులకు అనేక రంగాల్లో శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు. దీని ద్వారా భారత్‌లో నైపుణ్యాలను పెంపొందించాలనే అతని ఆశయాన్ని సాకారం చేసుకుంటున్నాడు. యువతకు రిటైల్‌, ఎలక్ట్రిక్‌ రంగాల్లో శిక్షణనిస్తున్నాడు. అయితే అధికారులు తప్పుగా చేసిన నమోదు వల్ల కొరియా వాసికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా అతన్ని దేశం విడిచి వెళ్లమని నోటీసులే అందాయి.  


''నాకు ఇండియా అంటే ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి కలలను నిజం చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి యువత స్వతంత్రంగా బతికేలా వారికి శిక్షణ ఇవ్వాలనేది నాకు ఇష్టం. ఇక్కడ కమ్యూనికేషన్‌ వల్ల నాకు చాలా కష్టాలు వచ్చాయి. నా తరపునుంచి ఆలోచించకుండా, నా వాదన వినకుండా నాకు ఎలా నోటీసులు ఇస్తారు? ఇక్కడి న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వాదన వినిపించుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది'' అని  బియ్యుంగ్ ఓ ఆంగ్ల ఛానెల్‌కు తెలిపారు. 

2015 నుంచి బియ్యుంగ్‌తో కలిసి పనిచేస్తున్న మనోజ్‌వర్మ మాట్లాడుతూ... ''సిబ్బంది ఎవరో తప్పుగా టైప్‌ చేసి ఉంటారు. తరువాత మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని సరిదిద్దలేదు. మేము లాయర్‌ను కలిస్తే.. నోటీసులు వచ్చే వరకు చూడండి అన్నారు. లోకల్‌ ఛానల్‌ బియ్యుంగ్‌ని కొరియన్‌ గూఢచారి అని ప్రచారం చేస్తోంది. ఇది చాలా బాధాకరం. అతను భారత యువత కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మన కోసం ఇంత చేస్తే మనం ఆయనకు ఇచ్చేది ఇదేనా?'' అని ప్రశ్నించారు. జిల్లా మేజిస్ట్రేట్‌ అఖిలేశ్‌ తివారి ఈ విషయంపై స్పందిస్తూ.. బియ్యుంగ్ అక్కడి యువతకు శిక్షణనిస్తూ, ఎంతో మంచి పేరు సంపాదించారు. అతని కేసు వివరాలు, సర్టిఫికేట్లను పరిశీలించమని ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement