ముంబై: మహారాష్ట్రలోని పలు నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. శివసేన చాలా కాలం నుంచి జౌరంగబాద్ నగరం పేరును శంభాజీనగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ ఆజ్మీ కూడా రాష్ట్రంలోని పలు నగరాల పేర్లు మార్చాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో ఆజ్మీ మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్లు మార్చాలనే ప్రతిపాదనను సభ ముందు ఉంచారు. అదేవిధంగా ఈ ప్రతిపాదనల వెనుక బీజేపీకిలాగా ఎలాంటి రహస్య ఎజెండా లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవీ ముంబై, థానే, పూణె నగరాల పేర్ల మార్పు ఎవరి మత విశ్వాసాలను దెబ్బతినకుండా ఉండాలని అన్నారు. అందుకే నవీ ముంబై పేరును ఛత్రపతి శివాజీ మహారాజ్ నగర్‌గా, థానే పేరును జిజామాతా నగర్‌గా, పూణె పేరును ఛత్రపతి శంభాజీ నగర్‌గా మార్చాలని కోరారు. మరోవైపు జౌరంగబాద్ పేరు మార్పుపై శివసేన ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. మొఘల్ చక్రవర్తి జౌరంగజేబు పేరుతో దానికి ఆ పేరు వచ్చిందని తెలిపారు. బీజేపీ నేతలు ఒకవేళ మతం పేరుతో నగరాల పేరును మార్పు చేస్తున్నట్టయితే.. వారి పార్టీలోని నాయకుల పేర్లు కూడా మార్చాలని అన్నారు. ఆ క్రమంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరును ముఖేశ్ చంద్రగా, షాహనవాజ్ హుస్సేన్ పేరును శంకర్ మహాదేవన్‌గా మార్చాలని ఎద్దేవా చేశారు.
కాగా, ఆజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజ్ పురోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్ర గురించి ఆజ్మీకి తెలియదని విమర్శించారు. సోదరులను చంపి, సంగీతంపై నిషేధం విధించిన క్రూరమైన పాలకుడు జౌరంగజేబు.. అటువంటి వ్యక్తిని ఆజ్మీ కీర్తిస్తున్నాడని మండిపడ్డారు. తాము జౌరంగబాద్ పేరు శంభాజీనగర్‌గా మార్చాలని అనుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment