ఏపీ హామీలపై వెనక్కి తగ్గం: వెంకయ్యనాయుడు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొనలేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ముంపు మండలాలను, ప్రత్యేక హోదాను చేర్చి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదని అన్నారు. ఏపీలో ఎమ్మెల్సీ సభ్యుల సంఖ్యను పెంచేందుకోసం తెచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై మంగళవారం లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని, అప్పటివరకు ఓపికతో ఉండాలని అన్నింటిని పూర్తి చేస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్పై నివేదిక అందిందని, మంత్రిత్వశాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. తెలంగాణలో కూడా విద్యుత్ సమస్యలున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వాటి అభివృద్ధికోసం కూడా కృషిచేస్తామని చెప్పారు. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించే యత్నాలు చేస్తున్నామని తెలిపారు.