
సీఎం పీఠం దక్కేదెవరికి?
జార్ఖండ్లో బీజేపీ అధికారం దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. దాంతో అక్కడ ముఖ్యమంత్రి స్థానం ఎవరికి దక్కుతుందోనన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే 38 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జార్ఖండ్లో అధికారం చేపట్టాలంటే కనీసం 41 స్థానాలు సాధించాలి. అది సాధారణ మెజారిటీ అవుతుంది. అయితే, జేవీఎం లాంటి పార్టీలు ఇప్పటికే పరోక్షంగా బీజేపీకి అండగా ఉన్నాయి. ఆ పార్టీ 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. దాంతో అక్కడ కమలనాథులు అధికారం చేపట్టడం దాదాపు ఖాయమైనట్లేనంటున్నారు. దాంతో అక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని అంచనాలు మొదలయ్యాయి.
బీహార్లోని ఉత్తర ప్రాంతాల నుంచి 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడింది. దానికి మొదటి నుంచి గిరిజన ముఖ్యమంత్రులే అధికారంలో ఉన్నారు. తొలి సీఎం బాబూలాల్ మరాండీ, ఆ తర్వాత వరుసగా అర్జున్ ముండా, శిబు సోరెన్, మధుకోడా, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్... ఇలా అందరూ గిరిజనులే. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ఈసారి గిరిజనేతరుడిని ముఖ్యమంత్రిగా చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రమంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, మరో నాయకుడు రఘువర్ దాస్, రాజస్థానీ నేత ఆర్కే మారు, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా.. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని సీఎం చేయొచ్చని అంటున్నారు. వీళ్లలో అర్జున్ ముండా మాత్రం గిరిజనుడు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రంలో మోదీకి అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రుల్లో ఒకరు. ఈ నలుగురిలో ఒకరికి సీఎం పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తోంది.