న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మళ్లీ చావుదెబ్బ! మరో రెండు రాష్ట్రాలు ఆ పార్టీ చేజారాయి. జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల్లో ఓటమితో కష్టాలు పెరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల నుంచి వరుస పరాజయాలే ఎదురవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం మొదలైంది. లోక్‌సభ 44 మంది ఎంపీలకే పరిమితమైన కాంగ్రెస్.. ఆ తర్వాత మహారాష్ర్ట, హరియాణా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మోదీ హవాలో కొట్టుకుపోయింది. తాజాగా జార్ఖండ్‌లోనూ అదే పునరావృతమైంది. జేడీయూ, ఆర్జేడీతో కాంగ్రెస్ చేతులు కలిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
ఈ కూటమి పదిలోపు సీట్లకే పరిమితం కావడం ఊహించని పరిణామం. జార్ఖండ్ ప్రభుత్వంలో జేఎంఎంతో కలిసి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీలు ఎన్నికల వేళ వేరుగా పోటీచేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక కశ్మీర్‌లో ఎన్‌సీతో కలిసి ఆరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు షాక్‌నిచ్చాయి. బీజేపీ అనూహ్య విజయాలు సాధించి రాష్ర్టంలో రెండో పెద్ద పార్టీగా మారడం ఆ పార్టీకి శరాఘాతమే.
తన ఓటమి కంటే కాషాయ పార్టీ బలపడటమే కాంగ్రెస్‌ను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు పీడీపీకి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా ప్రకటన లు కూడా గుప్పిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పార్టీ ప్రతినిధి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.
కష్టాల కడలిలో కాంగ్రెస్
Published Wed, Dec 24 2014 1:58 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement