Jharkhand-election
-
కష్టాల కడలిలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు మళ్లీ చావుదెబ్బ! మరో రెండు రాష్ట్రాలు ఆ పార్టీ చేజారాయి. జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల్లో ఓటమితో కష్టాలు పెరిగాయి. గత లోక్‌సభ ఎన్నికల నుంచి వరుస పరాజయాలే ఎదురవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం మొదలైంది. లోక్‌సభ 44 మంది ఎంపీలకే పరిమితమైన కాంగ్రెస్.. ఆ తర్వాత మహారాష్ర్ట, హరియాణా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మోదీ హవాలో కొట్టుకుపోయింది. తాజాగా జార్ఖండ్‌లోనూ అదే పునరావృతమైంది. జేడీయూ, ఆర్జేడీతో కాంగ్రెస్ చేతులు కలిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ కూటమి పదిలోపు సీట్లకే పరిమితం కావడం ఊహించని పరిణామం. జార్ఖండ్ ప్రభుత్వంలో జేఎంఎంతో కలిసి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీలు ఎన్నికల వేళ వేరుగా పోటీచేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక కశ్మీర్లో ఎన్సీతో కలిసి ఆరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు షాక్‌నిచ్చాయి. బీజేపీ అనూహ్య విజయాలు సాధించి రాష్ర్టంలో రెండో పెద్ద పార్టీగా మారడం ఆ పార్టీకి శరాఘాతమే. తన ఓటమి కంటే కాషాయ పార్టీ బలపడటమే కాంగ్రెస్‌ను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు పీడీపీకి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా ప్రకటన లు కూడా గుప్పిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పార్టీ ప్రతినిధి అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. -
కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం: మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తల కష్టానికి, అంకితభావానికి జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల ఫలితాలు ప్రతిఫలమని ప్రధాని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల్లోని కార్యకర్తలకు అభినందనలు. కశ్మీర్లో నమోదైన రికార్డు పోలింగ్ ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని చాటింది. బీజేపీపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. జార్ఖండ్ ప్రజలు స్థిరత్వానికే పట్టంకట్టారు. వారికి కూడా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. మోదీకి చంద్రబాబు అభినందన సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే ప్రజలు అభివృద్ధికి ఓటేశారని అర్థమవుతోందని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. -
రసకందాయంలో కశ్మీర్ రాజకీయం!
ప్రజల ఆకాంక్షల మేరకే నడుస్తామన్న పీడీపీ ‘కింగ్ మేకర్’గా నిలిచిన బీజేపీ శ్రీనగర్: కశ్మీర్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ‘కింగ్‌మేకర్’గా మారడంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీ, కాంగ్రెస్ సైతం పొత్తులకు సుముఖంగా ఉండటంతో పరిస్థితి రసకందాయంలో పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడం: ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడబోమని, సంఖ్యాబలాన్ని కూడగట్టి హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. కశ్మీరీల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పీడీపీకి కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ బేషరతు మద్దతు ప్రతిపాదన చేయడంపై ప్రశ్నించగా 2002 నుంచి 2008 నాటి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ర్ట ప్రజలకు మంచి చేసిందని ముఫ్తీ పేర్కొన్నారు. మూడు ప్రత్యామ్నాయాలు: అమిత్ షా సాక్షి,న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. ‘ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బయటి నుంచి ఎవరికైనా మద్దతు ఇవ్వడం, ఎవరి ప్రభుత్వంలోనైనా కలవడం అనే ప్రత్యామ్నాయాలు మాకు ఉన్నాయి’’ అని చెప్పారు. ఎన్సీ, ఇతరులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం (ఇందుకు ప్రతిఫలంగా ఒమర్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం) లేదా పీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని చెరో మూడేళ్లు పంచుకోవడం అనే అవకాశాలను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పీడీపీ కోరితే మద్దతు: ఒమర్ పీడీపీకి మద్దతు అంశాన్ని తోసిపుచ్చడంలేదని అదే సమయంలో వ్యతిరేకించడమూ లేదని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ మద్దతు తమ కోరితే పరిశీలిస్తామన్నారు. బీజేపీతో పొత్తుకు సిద్ధంగా లేమన్నారు. -
ఓటమి పాలైన 15 మంది మంత్రులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికశాతంలో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చెందగా, ఎన్సీ(నేషనల్ కాన్పరెన్స్ ) నుంచి ఆరుగురు పరాజయం పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక మంత్రి ఈసారి ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఒమర్ అతి కష్టం మీద బయటపడ్డారు. సోనావార్ నియోజక వర్గంలో 4,700 ఓట్లతో ఓటమి పాలైన ఒమర్.. బీర్వాలో కూడా ఓటమి పాలైనట్లు వార్తలు వచ్చాయి. అయితే 1,000 మార్జిన్ ఓట్లతో ఒమర్ బీర్వాలో విజయాన్ని కైవశం చేసుకున్నారు. ఓటమి పాలైన మంత్రుల్లో డిప్యూటీ చీఫ్ మినిష్టర్- తారా చంద్(ఎన్సీ), ఆరోగ్య శాఖమంత్రి- తాజ్ మోహిద్దీన్(ఎన్సీ), పర్యాటక శాఖ మంత్రి- గులామ్ అహ్మద్ మిర్(కాంగ్రెస్), అబ్దుల్ రహీమ్ రాథే(ఆర్థిక శాఖ మంత్రి) తదితర ఉద్దండులు ఓటమి చెందారు. -
'ప్రభుత్వ ఏర్పాటుకు టైమ్ పడుతుంది'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడడం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆమె చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ఏది అత్యుత్తమో అదే చేస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం పడుతుందని తెలిపారు. మంగళవారం వెల్లడైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ సంఖ్య 44. -
జమ్మూలో సంకీర్ణం!
-
జార్ఖండ్ లో కమలం..
-
బీజేపీ కార్యకర్తలకు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బీజేపీ కార్యక్తలు కష్టపడి నిస్వార్థంగా అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయని అన్నారు. బీజేపీకి బాసటగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సుస్థిర ప్రభుత్వ కాంక్షతో జార్ఖండ్ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో జమ్మూకశ్మీర్ ప్రజల పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొన్నారని, వారిని ధన్యవాదాలు తెల్పుతున్నానని మోదీ ట్వీట్ చేశారు. -
99 శాతం అవకాశం లేదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: ముఖ్యమంత్రి పదవిపై ఇక ఆశలు లేవని నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత, ప్రస్తుత కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన బీర్వా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని ఆయన ప్రకటించారు. బీర్వా స్థానం నుంచి విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో 99 శాతం బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. సోనావార్ స్థానంలోనూ పోటీ చేసిన ఆయన అక్కడ ఓటమి పాలయ్యారు. సోనావార్ లో తనపై గెలిచిన పీడీపీ అభ్యర్థి మహ్మద్ అష్రాఫ్ మిర్ ను ఆయన అభినందించారు. ఆరేళ్ల పాటు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్దమన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఎవరూ సంప్రదించలేదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. -
జార్ఖండ్ లో కమలం.. జమ్మూలో సంకీర్ణం!
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. 81 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 42 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసుకుంది. అయితే అధికార జేఎంఎం మాత్రం 18 సీట్లకే పరిమితం కాగా, జేవీఎం 7 సీట్లతో మూడో్ స్థానంలో నిలిచింది. కాగా, కాంగ్రెస్12 సీట్లను మాత్రమే కైవశం చేసుకుని ఊరట చెందింది. ఈ ఎన్నికల్లో ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందడం గమనార్హం. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్ లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో జమ్మూలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూలో పీడీపీ 28 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ 25సీట్లతో రెండో స్థానాన్ని కైవశం చేసుకుంది. ఇక్కడ అధికార ఎన్సీ (నేషనల్ కాన్ఫిరెన్స్) 15 స్థానాలకే పరిమితం కాగా, కాంగ్రెస్ కు 6 స్థానాలు దక్కాయి. ఈసారి బీజేపీ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకుని పీడీపీతో పోటీ పడింది. -
బీజేపీని ఆదరించినందుకు థ్యాంక్స్: అమిత్ షా
న్యూఢిల్లీ: జార్ఖండ్ లో మంచి పాలన అందిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. జార్ఖండ్ అభివృద్ధి కేవలం బీజేపీ వల్లే సాధ్యమన్నారు. జమ్మూకశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 2014 బీజేపీకి ఎన్నికల విజయనామ సంవత్సరమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీని ఆదరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు, నేతలకు అభినందనలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. జార్ఖండ్ లో సుస్థిర, నీతివంతమైన పాలన అందిస్తామని తెలిపారు. చాలా కాలం తర్వాత జార్ఖండ్ ప్రజలు ఒకే పార్టీకి పట్టం కట్టారన్నారు. కశ్మీర్ లో బాగా పుంజుకున్నామని, 23 శాతం ఓట్లు సాధించామని అమిత్ షా వెల్లడించారు. -
బీజేపీని ఆదరించినందుకు థ్యాంక్స్: అమిత్ షా
-
ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ గెలుపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శాసనసభల్లో పోటీ చేసిన రాజకీయ ప్రముఖులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పలువురు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. పీడీపీ అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయ్యిద్ గెలుపొందారు. అనంతనాగ్ స్థానం నుంచి 6 వేల పైచిలుకు ఓట్లతో నెగ్గారు. వేర్పాటువాద మాజీ నాయకుడు సాజిద్ గనీ లోన్ కూడా విజయం సాధించారు. హంద్వారా అసెంబ్లీ స్థానం నుంచి 4800 పైగా ఓట్లతో గెలిచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్ ఓటమి పాలయ్యారు. ఛాంబ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తారాచంద్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కిషన్ లాల్ చేతిలో 14,790 ఓట్లతో ఓడిపోయారు. మాజీ బ్యాంకర్ హసీబ్ డ్రాబు రాజ్‌పొరా స్థానం నుంచి గెలుపొందారు. -
పీడీపీకి మద్దతు ఇస్తాం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో పీడీపీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం పీడీపీకి వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. గతంలో పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్ తో జట్టు కట్టిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని స్పష్టం చేశారు. పీడీపీ కోసం తమ పార్టీ తలుపులు తెరిచివున్నాయని చెప్పారు. కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ అతిపెద్ద పార్టీగా అవరించే అవకాశముందని ఎన్నికల ఫలితాల సరళి వెల్లడి చేస్తుండడంతో ఆయనీ విధంగా స్పందించారు. -
36 ఏళ్ల రికార్డు బద్దలు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ఆర్థిక మంత్రి అబ్దుల్ రహీం రాథర్ రికార్డు బద్దలయింది. 36 ఏళ్లుగా శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. సెంట్రల్ కశ్మీర్ లోని చరార్-ఈ-షరీఫ్ అసెంబ్లీ స్థానానికి 36 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇప్పుడు అదే స్థానం నుంచి పరాజయం పాలయ్యారు. నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్ సీ) అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పీడీపీ అభ్యర్థి, శాసనమండలి మాజీ చైర్మన్ గులాం నబీ లోన్ చేతిలో కంగుతిన్నారు. 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాథర్ పై గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన గులాం నబీ లోన్ ఓడిపోయారు. మూడో పర్యాయం ఆయనకు అదృష్టం కలిసొచ్చింది. -
ఓడి గెలిచిన కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఒమర్ రెండు చోట్లా ఓడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సోనావార్‌లో పరాజయంపాలైనట్టు అధికారులు ప్రకటించారు. బీర్వాలోనూ ఓడినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒమర్ అతిస్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఒమర్ వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా ఆయన సారథ్యంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చిత్తుగా ఓడిపోయింది. -
కశ్మీర్ ఎన్నికలు: ప్రముఖులు ఎవరెక్కడ?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అధికార పార్టీకి దారుణమైన పరాజయం ఎదురైంది. ఏకంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓడిపోయారు. ఇక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినట్టే పీడీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఈ రాష్ట్రంలో పోటీ చేసిన ప్రముఖుల వివరాలిలా.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఘోర పరాజయం పాలయ్యారు. సోనావార్, బీర్వా నియోజవర్గాల నుంచి పోటీ చేసిన ఒమర్ బీర్వాలో మాత్రం స్వల్ప మెజారిటీతో నెగ్గారు. సోనావార్ లో ఆయన ఓడిపో్యారు. మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నేత ముఫ్తీమహమ్మద్ సయీద్ అనంతనాగ్ నుంచి విజయం సాధించారు. -
కశ్మీర్లో హంగ్.. పీడీపీకే ఆధిక్యం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశమున్నా, మెజార్టీ దరిదాపులకు కూడా వెళ్లలేకపోతోంది. 87 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 15, ఎన్సీ 13 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. పీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ అనంతనాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాగా కశ్మీర్ ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మారుతోంది. ఉదయం పీడీపీ ముందంజలో ఉండగా, ఆ తర్వాత బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. అనంతరం ఇరు పార్టీలు నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. ప్రస్తుతం పీడీపీ మళ్లీ ముందంజలో ఉంది. -
జార్ఖండ్, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు..
-
జమ్మూలో బీజేపీ.. కశ్మీర్లో పీడీపీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఇరు పార్టీలు చెరో 23 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ, పీడీపీ ఒక్కో ప్రాంతానికే పరిమితం కావడం గమనార్హం. జమ్మూలో బీజేపీ దాదాపు మూడింటి రెండొంతుల స్థానాల్లో సత్తాచాటగా, కశ్మీర్లో పీడీపీ సగం స్థానాల్లో సొంతం చేసుకోనుంది. కశ్మీర్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో, జమ్మూలో పీడీపీ కూడా రెండు చోట్ల మాత్రమే ముందంజలో ఉన్నాయి. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో 87 సీట్లుండగా, జమ్మూలో 37, కశ్మీర్లో 46 నియోజకవర్గాలున్నాయి. లడఖ్ ప్రాంతంలో 4 ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైనా.. .. రెండు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగ్గ స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక లడఖ్ ప్రాంతంలో నాలుగు పార్టీలు ఒక్కో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. -
అప్పుడే స్వీట్లు పంచేసుకున్నారు!
బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న బీజేపీ.. జమ్ము కాశ్మీర్లో కూడా అనుకున్నదాని కంటే మెరుగైన ఫలితాలనే సాధిస్తోంది. దాంతో కమలనాథులు ఆనందంలో తేలియాడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. అక్కడ కమలనాథులు స్వీట్లు పంచుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 81 స్థానాలకు గాను బీజేపీ 41 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేఎంఎం 20 చోట్ల, జేవీఎం 9 చోట్ల, కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి. జమ్ము కాశ్మీర్లో కూడా బీజేపీ కాస్త ముందంజలోనే ఉంది. అక్కడ పీడీపీ 24, బీజేపీ 23, నేషనల్ కాన్ఫరెన్స్ 17, కాంగ్రెస్ 15 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నాయి. -
ఎగ్జిట్ పోల్స్‌ను ప్రతిబింబిస్తున్న ఫలితాలు
-
వణికించే చలిలో వేడెక్కిన రాజకీయం
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. చలి వణికిస్తోంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు మాత్రం అందరికీ మంచి వేడి పుట్టిస్తున్నాయి. అంచనాలకు ఏమాత్రం అందకుండా అక్కడ ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన సమయంలో కొంతవరకు ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ ముందంజలో ఉన్నట్లు కనిపించినా.. తర్వాత ఫలితాల సరళి గణనీయంగా మారిపోయింది. అక్కడ మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 86 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెల్లడయ్యాయి. వాటిలో పీడీపీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే ముందుండగా, బీజేపీ 22 చోట్ల ముందుంది. నేషనల్ కాన్ఫరెన్స్ 19 చోట్ల, కాంగ్రెస్ 15 స్థానాల్లోను ముందడుగు వేశాయి. ఇతరులు మరో 7 చోట్ల తమ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇలా ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి కనిపిస్తోంది. ఈసారి అక్కడ హంగ్ అసెంబ్లీ తప్పదన్న జోస్యం మాత్రం నిజమవుతోంది. -
కశ్మీర్ ఫలితాల సరళిలో మార్పు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల సరళి మారింది. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ దూసుకొచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, పీడీపీ రెండో స్థానానికి పడిపోయింది. ఇక మొదట్లో చాలా వెనుకబడ్డ అధికార నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ క్రమేణా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం బీజేపీ 23, పీడీపీ 2, ఎన్సీ 19, కాంగ్రెస్ 15, ఇతరులు 7 చోట్ల ముందంజలో ఉన్నాయి. -
కశ్మీర్లో బీజేపీ ఆధిక్యం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. మొదట్లో పీడీపీ ముందంజలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. క్రమేణా పీడీపీ జోరు కాస్త తగ్గగా, బీజేపీ మరింత ముందంజ వేసింది. ప్రస్తుతం బీజేపీ 23 చోట్ల ముందంజలో ఉండగా, పీడీపీ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాగా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చతికిలపడింది. మొదట్లో ఎన్సీ, కాంగ్రెస్ వెనుకబడినా క్రమేణా పుంజుకుంటున్నాయి. -
కశ్మీర్ సీఎం వెనుకంజ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అధికార నేషనల్ కాంగ్రెస్ చతికిలపడింది. ఏకంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వెనుకంజలో ఉన్నారు. సోనావార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఒమర్ వెనుకబడి ఉన్నారు. కాగా ఒమర్ రెండు చోట్ల పోటీ చేశారు. బీర్వా నియోజకవర్గంలో మాత్రం ఒమర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో పీడీపీ, బీజేపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. పీడీపీ ముందంజలో ఉండగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది. -
జార్ఖండ్: అంచనాలకు మించి దూసుకెళ్తున్న బీజేపీ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి విజయపథంలో దూసుకెళ్తోంది. ఇంతకాలం అక్కడ అధికారంలో ఉన్న జేఎంఎం - కాంగ్రెస్ కూటమిని చావుదెబ్బ కొట్టి మరీ ముందడుగు వేస్తోంది. అక్కడ మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వాటిలో కడపటి వార్తలు అందేసరికి 65 స్థానాల్లో ఆధిక్యాలు వెల్లడయ్యాయి. అందులో 44 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. జేఎంఎం కేవలం 12 స్థానలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ మరీ దారుణంగా 5 చోట్ల మాత్రమే ముందంజలో ఉంది. ఇక జేవేఎం, ఇతరులు మరో రెండేసి చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 81 స్థానాలకు గాను 52 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఏబీపీ నీల్సన్, 41-49 వస్తాయని ఇండియాటుడే అంచనా వేశాయి. -
హంగ్ దిశగా కశ్మీర్ ఫలితాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. పీడీపీ ముందంజలో ఉండగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఫలితాల సరళిని బట్టి కశ్మీర్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ చతికిలపడింది. కాంగ్రెస్ పరిస్థితి కూడా మెరుగుపడలేదు. 87 అసెంబ్లీ స్థానాలున్న కశ్మీర్లో ప్రస్తుతం పీడీపీ 30 చోట్ల ఆధిక్యంలో ఉంది. బీజేపీ 22, ఎన్సీ 12, కాంగ్రెస్ 7 చోట్ల ముందంజలో ఉన్నాయి. మరో 12 చోట్ల ఫలితాలు ఇంకా వెలువడాల్సివుంది. -
ఇద్దరు మాజీ సీఎంల వెనుకంజ
జార్ఖండ్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈసారి ఎన్నికల్లో అసలు గెలిచే లక్షణాలే కనిపించడంలేదు. మాఝ్గావ్ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి మధుకోడా మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో వెనకబడి ఉన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కూడా ధాన్వాడ్ స్థానంలో వెనకబడే ఉన్నారు. దాంతో వీళ్లిద్దరూ గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. ఇంకో మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ మాత్రం ముందంజలో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఆధిక్యాలు చూస్తే, జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకు గాను 41 చోట్ల ఆధిక్యాలు తెలుస్తున్నాయి. వాటిలో 29 చోట్ల బీజేపీ, 9 చోట్ల జేఎంఎం, 2 చోట్ల కాంగ్రెస్, 1 చోట జేవీఎం ఆధిక్యంలో ఉన్నాయి. జమ్ము కశ్మీర్ రాష్ట్రం చూస్తే.. అక్కడున్న మొత్తం 87 స్థానాలకు గాను 73 చోట్ల ఆధిక్యాలు వెల్లడయ్యాయి. వాటిలో 31 చోట్ల పీడీపీ, 18 చోట్ల బీజేపీ, 14 చోట్ల నేషనల్ కాన్ఫరెన్స్, 8 చోట్ల కాంగ్రెస్ ముందంజలో ఉండగా మూడు చోట్ల ఇతరులు ముందున్నారు. -
ఎగ్జిట్ పోల్స్‌ను ప్రతిబింబిస్తున్న ఫలితాలు
ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాల్లోను ఇప్పటివరకు అందుతున్న ఆధిక్యాలు సుమారుగా ఎగ్జిట్ పోల్స్‌కు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. జార్ఖండ్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. మిగిలిన పార్టీలకు ఏమాత్రం అందుబాటులో లేకుండా దూసుకెళ్తోంది. అక్కడ మొత్తం 81 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 9 గంటల వరకు సుమారు 30 నియోజకవర్గాలకు సంబంధించిన ఆధిక్యాలు తెలుస్తున్నాయి. వాటిలో బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేఎంఎం 5 స్థానాల్లోను, కాంగ్రెస్ 2 స్థానాల్లోను, జేవీఎం 2 స్థానాల్లోను ఆధిక్యంలో ఉన్నాయి. ఇక జమ్ము కశ్మీర్లో కూడా కొంతవరకు అనుకున్నట్లుగానే వస్తున్నా.. బీజేపీ మాత్రం అంచనాలను మించి కొంత ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికీ అక్కడ పీడీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 87 స్థానాలకు గాను 71 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు తెలుస్తున్నాయి. వాటిలో 28 చోట్ల పీడీపీ, 22 చోట్ల బీజేపీ ముందంజలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ 13, కాంగ్రెస్ 6, ఇతరులు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు. -
ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం
-
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
-
ఓట్ల లెక్కింపు ప్రారంభం; బీజేపీ ఆధిక్యం
జమ్ము కాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోను ఐదు విడతలుగా ఎన్నికలను నిర్వహించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అందుతున్న వివరాల ప్రకారం బీజేపీ ఆధిక్యం కనపడుతోంది. జార్ఖండ్‌లో 7 చోట్ల బీజేపీ, ఒకచోట కాంగ్రెస్, 2 చోట్ల జేఎంఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు కశ్మీర్లో మాత్రం ముందునుంచి అనుకున్నట్లే పీడీపీ కొంత ముందంజలో ఉంది. జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో 11 స్థానాల్లో పీడీపీ, 5 చోట్ల బీజేపీ, 2 చోట్ల కాంగ్రెస్, 1 చోట నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యంలో ఉన్నాయి.