కశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం..
ప్రజల ఆకాంక్షల మేరకే నడుస్తామన్న పీడీపీ
‘కింగ్ మేకర్’గా నిలిచిన బీజేపీ
శ్రీనగర్: కశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ‘కింగ్‌మేకర్’గా మారడంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్‌సీ, కాంగ్రెస్ సైతం పొత్తులకు సుముఖంగా ఉండటంతో పరిస్థితి రసకందాయంలో పడింది.
ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడం: ముఫ్తీ
ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడబోమని, సంఖ్యాబలాన్ని కూడగట్టి హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. కశ్మీరీల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పీడీపీకి కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ బేషరతు మద్దతు ప్రతిపాదన చేయడంపై ప్రశ్నించగా 2002 నుంచి 2008 నాటి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ర్ట ప్రజలకు మంచి చేసిందని ముఫ్తీ పేర్కొన్నారు.
మూడు ప్రత్యామ్నాయాలు: అమిత్ షా
సాక్షి,న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. ‘ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బయటి నుంచి ఎవరికైనా మద్దతు ఇవ్వడం, ఎవరి ప్రభుత్వంలోనైనా కలవడం అనే ప్రత్యామ్నాయాలు మాకు ఉన్నాయి’’ అని చెప్పారు. ఎన్‌సీ, ఇతరులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం (ఇందుకు ప్రతిఫలంగా ఒమర్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం) లేదా పీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని చెరో మూడేళ్లు పంచుకోవడం అనే అవకాశాలను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పీడీపీ కోరితే మద్దతు: ఒమర్
పీడీపీకి మద్దతు అంశాన్ని తోసిపుచ్చడంలేదని అదే సమయంలో వ్యతిరేకించడమూ లేదని ఎన్‌సీ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ మద్దతు తమ కోరితే పరిశీలిస్తామన్నారు. బీజేపీతో పొత్తుకు సిద్ధంగా లేమన్నారు.