సాక్షి,అయోధ్య: వచ్చే దీపావళి నాటికి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుందని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సర్కార్ బుధవారం దీపోత్సవ్ పేరిట అయోధ్యలో భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీ లోక్‌సభ స్ధానాల్లో భారీ విజయానికి అవసరమైన కసరత్తులో భాగంగానే బీజేపీ అయోధ్య కేంద్రంగా కార్యక్రమాలను ముమ్మరం చేస్తోందని భావిస్తున్నారు.ఈ పరిణామాలన్నీ మందిర్ అంశాన్ని మళ్లీ బీజేపీ తెరపైకి తెస్తున్నదనేందుకు సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక యూపీ సీఎం సమక్షంలో దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. పురాతన ఆలయ పట్టణం అయోధ్య వారసత్వ సంపదను చాటే రీతిలో బుధవారం సరయూ నదీ తీరంలో లక్షా 70 వేల దీపాలను వెలిగించనున్నారు.
కాగా, రామాయణ కావ్యంలో పేర్కొన్న విధంగా రావణాసురుడుపై విజయం సాధించి భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన క్రమంలో లభించే సాదర స్వాగతాన్ని మరిపించే వాతావరణాన్ని సృష్టించేలా దీపోత్సవ్‌ను చేపడుతున్నట్టు యూపీ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు దీపావళి సందర్భంగా అయోధ్యలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని యూపీ టూరిజం ప్రిన్సిపల్ కార్యదర్శి అవనీష్ అవస్థి తెలిపారు. చారిత్రక భవంతులు, ఘాట్‌లను టూరిస్ట్‌లను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రాముడి జన్మస్థలం అయోధ్యను మెగా టూరిస్ట్ స్పాట్‌గా మలచడమే తమ ముఖ్యోద్ధేశమని అధికారులు చెబుతున్నారు. శ్రీరాముడు అయోథ్యకు తిరిగి రావడాన్ని కన్నులకు కట్టేలా హెరిటేజ్ వాక్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని అవస్థి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment