సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆదివాసి తెగకు చెందిన ఓ సంతాల్ యువతిని పోలీసు స్టేషన్లో పోలీసులు వరుసగా అత్యాచారం చేస్తారు. వారు తమ కామక్రీడను ముగించుకున్నాక ఆమెకు కట్టుకోవడానికి బట్టలిస్తారు. ఆమె ఆ బట్టలను చించిపారేసి తొడల మధ్య నుంచి రక్తం కారుతుండగా వీధిలోకి నగ్నంగా పరుగెత్తుతుంది. ఎదురు పడిన ఓ పోలీసు ఉన్నతాధికారి చేతుల్లోకి ఒంట్లో శక్తిలేక ఒరిగి పోతుంది. భయమంటే తెలియని ఆ పోలీసు అధికారి ఆమె పరిస్థితి చూసి జీవితంలో తొలిసారి భయపడతారు.’ ఇది ప్రముఖ రచయిత్రి మహాశ్వేతా దేవీ రాసిన ‘ద్రౌపది’ షార్ట్ స్టోరీ ముగింపు సన్నివేశం. అలా ఆమె బట్టలు చించేసి వీధిలోకి పరుగెత్తి రావడానికి కారణం సిగ్గులేని ప్రపంచాన్ని సిగ్గుపడేలా చేయడం కోసం.
ఇంతవరకు ఇది కథయితే నిజ జీవితంలో కొంత మంది మణిపూర్ మహిళలు 2004లో తమ నగ్న శరీరాలనే ఆయుధంగా చేసుకున్నారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు మనోరమ అనే యువతిని రేప్ చేసి చిత్రహింస పెట్టినందుకు సంఘీభావంగా వారంతా నడి వీధిలో, రైఫిల్స్ భవనం ముందు నగ్నంగా నిరసన ప్రదర్శన చేశారు. దమ్ముంటే ఇప్పుడు తమపై అత్యాచారం చేయడంటూ సవాల్ విసిరారు. ఆనాడు ఈ సంఘటన దేశాన్నే కుదిపేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా చేసింది.
ఇప్పుడు టాలీవుడ్‌కు చెందిన నటి శ్రీరెడ్డి హైదరాబాద్ రోడ్డుపై పట్ట పగలు బట్టలు విప్పుకొని తెలుగు సినీ పరిశ్రమ గుడ్డలూడదీశారు. ఇక్కడ కూడా నగ్న శరీరమే ఆయుధంగా మారింది. ‘మీరంతా వినాలంటే నాకు ఇదొక్కటే మార్గంగా కనిపించింది. సినీ పరిశ్రమలో పాత్రల కోసం నేను ఎంతో మంది ముందు నగ్నంగా నిలబడాల్సి వచ్చింది. పాత్రలు ఇస్తానన్న వారు మోసం చేశారు. నాకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి అరిచాను. నా ఒక్కదానికే కాదు, సినిమా ఛాన్స్‌లు ఇస్తామంటూ ఎంతో మంది మహిళలను మోసం చేస్తున్నారు. సినిమా కళాకారుల సంఘం నుంచి సరైన సమాధానం ఇప్పటికీ రాకపోవడంతో ఈ విషయం అందరి దృష్టికి తీసుకరావడం కోసమే నేను పబ్లిగ్గా బట్టలిప్పడానికి సిద్ధపడ్డాను’ అంటూ శ్రీరెడ్డి మనో వ్యధను వెల్లడించారు. అందుకని ఆమెకు సంస్కారం లేదంటూ ఉంటున్న ఇంటి నుంచి ఖాళీ చేయమన్నారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం సినిమా ఇండస్త్రీలో ఎంతో మందికి జరిగే ఉంటుంది. వారంతా ఒక్కొక్కరుగానైనా బయటకు వచ్చినప్పుడే పరిశ్రమలో ప్రక్షాళన ప్రారంభం అవుతుంది.
అమెరికా ప్రముఖ నిర్మాత హార్వి వైన్‌స్టీన్ సెక్స్ స్కామ్ గురించి న్యూయార్క్ టైమ్స్ గతేడాది బయటపెట్టగానే ఇప్పటివరకు 85 మంది బాధితులు ‘మీ టూ’ అంటూ స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. వారిలో ఎంజెలినా జోలి, కేట్ బెకిన్సలే, లిసెట్టి ఆంథోని, గ్వినెథ్ పాల్ట్రో, మీరా సార్వినో, డెరిల్ అన్నా లాంటి ప్రముఖ తారలెందరో ఉన్నారు. ప్రస్తుతం వైన్‌స్టీన్ మీద లాస్ ఏంజెలిస్, న్యూయార్క్ సిటీ, లండన్ నగరాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
- నరేందర్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment