సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయం–బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నాడు ప్రకటించిన ముగ్గురు మధ్యవర్తుల కమిటీలోకి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్‌ను తీసుకోవడం ఏ మేరకు సమంజసం? కోర్టు బయట సెటిల్మెంట్ ద్వారా ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చో ఇదివరకే ఆయన తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. అవి ముస్లిం వర్గాలు ఆమోదించేలా ఉన్నాయా? అవి ఏమిటీ? వాటిని పరిగణలోకి తీసుకొనే ఇప్పుడు ఆయన్ని ముగ్గురు మధ్యవర్తుల కమిటీలోకి సుప్రీం కోర్టు తీసుకుందా? రవి శంకర్ అభిప్రాయాలు లేదా సూచనలను అమలు చేయడం వల్ల సుదీర్ఘకాలంగా నలుగుతున్న మందిర్–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? చదవండి...(‘అయోధ్య’పై మధ్యవర్తిత్వం)
2018లో ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశ్రీ రవి శంకర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు: ‘ సుప్రీం కోర్టు తీర్పు ఎవరికి విరుద్ధంగా వెలువడినా వారు తీవ్రవాదాన్ని ఆశ్రయిస్తారు. సిరియా లాంటి పరిస్థితి లేదా అంతర్యుద్ధం తప్పదు. అందుకని ఈ సమస్యను కోర్టు వెలుపలనే పరిష్కరించుకోవాలి. దానికి కూడా సుహద్భావ చర్యగా అయోధ్యపై ముస్లింలు తమ హక్కును వదులు కోవాలి. ఎందుకంటే రాముడు సంచరించిన అయోధ్య ముస్లిలకు ఆధ్యాత్మికమైనదేమీ కాదు’ అని చెప్పారు.
ఇక ఇదే విశయమై గతేడాది ఆయన ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు’కు రాసిన ఓ బహిరంగ లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు.
1. కోర్టు తీర్పు ప్రకారం హిందువులకే అయోధ్య స్థలం లభించి అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే ముస్లింలు భారత చట్టంపై, న్యాయ వ్యవస్థపై పూర్తిగా విశ్వాసం కోల్పోతారు. పర్యవసానంగా ముస్లింలు, ముఖ్యంగా యువకులు హింసాకాండకు దిగుతారు.
2, బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం వివాదాస్పద స్థలాన్ని ముస్లింలకే అప్పగిస్తే దేశవ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగుతాయి. గ్రామస్థాయి నుంచి హిందువుల అందరి విశ్వాసాన్ని, మన్ననలను ముస్లింలు పూర్తిగా కోల్పోతారు.
3. టైటిల్‌పై హక్కులు కోరుతున్న ముగ్గురు పిటషనర్లకు వివాదాస్పద భూమిని పంచాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లయితే 1992లో జరిగిన బాబీ మసీదు విధ్వంసం పునరావతం అవుతుంది.
4. కోర్టుతో సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉత్తర్వులు జారీచేసినా ముస్లిం గాయపడతారు. హింసాకాండకు పాల్పడతారు. నాలుగు సూచనల్లో ఏ సూచనను అమలు చేసిన ఇరువర్గాల మధ్య ఘర్షణలు, రక్తపాతం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకనే ఆయన మధ్యేమార్గంగా మరో సూచన చేశారు.
కోర్టు వెలుపల పరిష్కారం
‘కోర్టు వెలుపలే పరిష్కారం ఒక్కటే ఉత్తమమైన మార్గంగా నాకు కనిపిస్తోంది. హిందువుల పట్ల సుహద్భావంతో ముస్లింలు ముందుకు వచ్చి ఒక ఎకరం వివాదాస్పద స్థలాన్ని బహుమానంగా ఇవ్వాలి. అందుకు బదులుగా హిందువులు అక్కడికి సమీపంలోని ఐదు ఎకరాల స్థలాన్ని బహుమానంగా ఇస్తుంది. దీని వల్ల ముస్లింలు వంద కోట్ల హిందువుల మన్ననలను అందుకోవడంతోపాటు అయోధ్య వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ముస్లిం తరాలు ప్రశాంతంగా జీవించవచ్చు’ అని రవి శంకర్ సూచించారు.
ఆయన చేసిన ఈ సూచనతో పలువురు హిందూ సంస్థల నాయకులే అంగీకరించలేదు. విదేశాల నుంచి భారీ విరాళాలు అందుకున్న రవి శంకర్ ఆ విషయం నుంచి ప్రజల దష్టిని మళ్లించేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారని విశ్వహిందూ పరిషద్ నాయకులు విమర్శించారు. సంప్రతింపుల ద్వారా అయోధ్య పరిష్కారానికి గతంలోనే ప్రయత్నాలు జరగ్గా వాటిని అడ్డుకున్నదే రవి శంకర్ అంటూ అయోధ్యలోని హనుమాన్‌గఢీ ఆలయం అధిపతి మహంత్ జ్ఞాన్ దాస్ ఆరోపించారు. అన్ని వర్గాలు తమ ఈగోలను పక్కన పెట్టి సంప్రదింపుల ద్వారానే అయోధ్య సమస్యను పరిష్కరించుకోవాలంటూ సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులకు ఒక్క రోజు ముందే రవి శంకర్ ట్వీట్ చేశారు.
రవి శంకర్ సూచించినట్లు బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం ఒక ఎకరం కాదు. 2.77 ఎకరాల స్థలం. నాడు బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ఇరువర్గాల మధ్య రాజీ కోసం నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వివాదాస్పద స్థలానికి పక్కన దాదాపు 60 ఎకరాలను సేకరించింది. వాటిలో ఆలయంతోపాటు మ్యూజియం, యాత్రికుల వసతిశాలలు నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ స్థానంలో అయోధ్య పేరిట చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. వివాదాస్పద స్థలంలో అంగుళం కూడా వదులుకోమంటూ నాడు బీజేపీ ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు అదే బీజేపీ అధికారంలో ఉంది.
ఇక రవి శంకర్ సూచించినట్లు ముస్లింలు వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించినట్లయితే హిందూత్వ సంస్థలు ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశంలోని అన్ని వివాదాస్పద స్థలాలపై దాడులు చేసే అవకాశం ఉంటుందని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మధ్యవర్తుల కమిటీలో రవి శంకర్‌తోపాటు జస్టిస్ ఫక్కీర్ మొహమ్మద్ ఇబ్రహీం కాలిఫుల్లా, ప్రముఖ న్యాయవాది శ్రీరామ్ పాంచు ఉన్నారు కనుక ఎంత మేరకు వారి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment