కల్లోలంగానే కశ్మీర్...
- తాజా అల్లర్లలో ఓ పోలీసు సహా ఆరుగురి మృత్యువాత
- రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ నియంత్రణలు
శ్రీనగర్ : కశ్మీర్ అట్టుడుకుతోంది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు హతమార్చడంతో చెలరేగిన అల్లర్లు మరింత పెచ్చరిల్లాయి. తాజా అల్లర్లలో ఒక పోలీసు సహా ఆరుగురు చనిపోయారు. శనివారం నాటి అల్లర్లలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురు ఆస్పత్రిలో ఆదివారం ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పటి వరకూ కశ్మీర్ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్, దక్షిణ కశ్మీర్‌లోని 4 జిల్లాలు సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా నియంత్రణలను అధికారులు కొనసాగిస్తున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
కశ్మీర్ పరిణామాలను కేంద్రం నిశితంగా గమనిస్తోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని చెప్పారు. ముఫ్తీ ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆందోళనల్లో సామాన్య పౌరులు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతాబలగాలు అనవసరంగా ఆయుధాలను ఉపయోగించి ఉంటే, దర్యాప్తు జరుపుతామన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలని హురియత్ కాన్ఫరెన్స్ తదితర వేర్పాటువాద సంస్థలతో పాటు, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, లెఫ్ట్‌పార్టీలను కోరారు.
కశ్మీర్లో అనేక చోట్ల ఆదివారం కూడా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పుల్వామాలోని నెవా ప్రాంతంలో ఆదివారం భద్రతా సిబ్బందికీ, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇర్ఫాన్ అహ్మద్ అనే 18 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడ్డాడని, అతడిని శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మరో గుర్తుతెలియని వ్యక్తి కూడా పుల్వామా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని చెప్పారు. అనంతనాగ్ జిల్లాలోని సంగమ్ ప్రాంతంలో మొబైల్ బంకర్ వాహనాన్ని ఆందోళనకారులు జీలం నదిలోకి తోసేయడంతో అందులో ఉన్న పోలీస్ డ్రైవర్ ఫిరోజ్ అహ్మద్ మరణించాడని తెలిపారు.
మరో ఘటనలో పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఓ హెడ్ కానిస్టేబుల్ రెండు కాళ్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పారు. కాగా, శనివారం ఆందోళనకారులు దమ్హల్ హంజిపొరా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో గల్లంతైన ముగ్గురు పోలీసుల ఆచూకీ ఇంకా లభించలేదని కశ్మీర్ విద్యా శాఖ మంత్రి నయీమ్ అక్తర్ తెలిపారు. ఆదివారం ఆందోళనకారులు మూడు పోలీస్ స్థావరాలను, మరో మూడు ప్రభుత్వ కార్యాలయాలను, పీడీపీ ఎమ్మెల్యే నివాసాన్ని, ఓ బీజేపీ కార్యాలయంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. అల్లర్లను ఆసరాగా చేసుకున్న మిలిటెంట్లు పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలపై కాల్పులకు తెగబడ్డారు.
అమరనాథ్ యాత్ర నిలుపుదల
కశ్మీర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమరనాథ్ యాత్రను వరుసగా రెండో రోజు నిలిపేశారు. జమ్మూ నుంచి కొత్త బృందాన్ని పంపలేదని జమ్మూ డిప్యూటీ కమిషనర్ సిమ్రన్‌దీప్‌సింగ్ చెప్పారు. అయితే కశ్మీర్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్ర కొనసాగుతోందని చెప్పారు. మరోవైపు అమరనాథ్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా సిబ్బం ది రక్షణ ఏర్పాట్లు చేశారు. కాగా, ఇప్పటి వరకూ 1,18,747 మంది భక్తులు అమరనాథుడిని దర్శించుకున్నారు.