కర్ణాటకలో స్టింగ్ దుమారం
బెంగళూరు: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మెల్యేలను కొనేందుకు బేరసారాలు జరగుతున్న వీడియో విడుదలవటం సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరింది. కాంగ్రెస్ బలం ప్రకారం ఇద్దరు అభ్యర్థులకే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యేలను కొనుక్కుని గెలిచేందుకే మూడో అభ్యర్థిని రంగంలోకి దించిందని.. జేడీఎస్ ఆరోపించింది.
స్వతంత్ర అభ్యర్థికి ఓటేసేందుకు జేడీఎస్ ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియోలో ఉండగా, కాంగ్రెస్ బరిలో దించిన మూడో అభ్యర్థి రామమూర్తి.. తాను గెలిస్తే స్వతంత్ర అభ్యర్థులకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇప్పిస్తానన్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చేవారికి రూ.10 కోట్లు ఇచ్చేలా బేరం జరిగిందని మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించారు. అయితే జేడీఎస్ ఎమ్మెల్యేలవరూ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేయటం లేదని.. మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. అయితే మీడియాను పిచ్చోళ్లను చేసేందుకే జేడీఎస్ ఎమ్మెల్యే (స్టింగ్ వీడియోలో ఉన్న నేత) మల్లికార్జున కుబా స్టింగ్‌లో పాల్గొన్నాడన్నారు.