రాజ్యసభలో ‘అగస్టా’ సెగలు
సోనియా పాత్రపై సుబ్రమణ్యస్వామి ఆరోపణలు
♦ బీజేపీ ఎంపీగా ప్రమాణం చేసిన మర్నాడే కాంగ్రెస్ చీఫ్ లక్ష్యంగా దాడి
♦ చాపర్ డీల్ కేసులో ఇటలీ కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఆరోపణలు
♦ కాంగ్రెస్ సభ్యుల ఆగ్రహం.. స్వామిపై దూషణలు...
♦ ఆరోపణలన్నీ అబద్ధాలు.. విచారణను ఎందుకు పూర్తిచేయరు: సోనియా
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించటంపై కేంద్రాన్ని ఇరుకున పెడుతూ రెండు రోజులుగా రాజ్యసభలో ఆందోళనకు దిగి సభాకార్యక్రమాలను స్తంభింపజేస్తున్న కాంగ్రెస్‌పై అధికార పక్షం ‘అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కొనుగోళ్లలో ఆరోపణలను ఆయుధంగా చేసుకుని ఎదురుదాడికి దిగింది. మంగళవారమే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ లక్ష్యంగా సభలో ఆరోపణలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలుపుతూ గంట పాటు కార్యక్రమాలను స్తంభింపజేశారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల మూడో రోజు రాజ్యసభ సమావేశం కాగానే.. జీరో అవర్‌లో స్వామి చాపర్ ఒప్పందాన్ని లేవనెత్తుతూ అందులో సోనియాపై ఆరోపణలు గుప్పించారు.
డీల్ మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్.. ఇటలీ హైకోర్టుకు రాసిన ఒక లేఖలో చేసినట్లు చెప్తున్న ఆరోపణలను ఆయన పదే పదే ప్రస్తావించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. విపక్ష, అధికార పక్షాల మధ్య ఆగ్రహపూరిత వాదప్రతివాదనలు సాగాయి. కొందరు కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో అధికారపక్ష స్థానాల వైపు దూసుకెళ్లారు. పరిస్థితి అదుపుతప్పే సూచనలు కనిపించటంతో ఇద్దరు మార్షల్స్ కూడా ముందుకు కదిలి అడ్డుగా నిల్చున్నారు. అధికారపక్ష సభ్యులు సైతం తమ స్థానాల నుంచి లేచి నిల్చొని ఆగ్రహంగా ప్రతిస్పందించారు. దీంతో.. డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ వెంటనే సభను పది నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత సభకు వచ్చి తనను సమర్థించుకోలేని పార్లమెంటు సభ్యులపై ఆరోపణలు చేయజాలరంటూ.. సోనియాపై చేసిన కొన్ని ఆరోపణలను, ఆమె ప్రస్తావనలను కురియన్ తొలగించారు.
అయితే.. స్వామి తొలి ప్రసంగం అయినందున ఆయనను మందలించటం లేదని పేర్కొన్నారు. సోనియా లోక్‌సభ సభ్యురాలన్న విషయం తెలిసిందే. దీనికి సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లో నిలుచుని స్వామికి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. దీంతో సభ మళ్లీ వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక.. ‘సీఐఏ ఏజెంటు ఇక్కడ కూర్చున్నారు’ అంటూ స్వామిని ఉద్దేశించి నినాదాలు చేశారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోనిదే సభలో మాట్లాడనివ్వబోమని విపక్ష నేత గులాంనబీఆజాద్ పేర్కొన్నారు. స్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు ఆనంద్‌శర్మ కూడా ఆగ్రహంగా చెప్పారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్‌నక్వీ మాట్లాడుతూ.. సభ్యుడిని బెదిరించటం సరికాదని పేర్కొనగా.. ఆయనను ఎవరూ బెదిరించలేదని కాంగ్రెస్ సభ్యుడు హుస్సేన్ దాల్వాయ్ స్పందించారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలు కొనసాగిస్తుండగా.. అందరూ శాంతించాలని, ప్రశ్నోత్తరాలు చేపట్టాల్సి ఉందని అన్సారీ కోరారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాలకు వెళ్లి కూర్చున్నారు. అన్సారీ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా.. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులే చాపర్ డీల్ అంశాన్ని లేవనెత్తి.. తమ పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేశారని, ఈ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
దోషిగా తేలితే ఉరితీయండి: అహ్మద్
తనపైన, పార్టీపైన ఆరోపణలు నిరాధారమని అహ్మద్‌పటేల్ సైతం కొట్టివేశారు. తాను దోషిగా నిర్ధారితమైతే ప్రభుత్వం ఉరి తీయాలని విలేకర్లతో అన్నారు.
సోనియా, అహ్మద్, మన్మోహన్‌లను ప్రశ్నించాలి: స్వామి
అగస్టా ఒప్పందానికి సంబంధించి సోనియా, అహ్మద్‌పటేల్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సహా అందరు వ్యక్తులనూ ప్రశ్నించాలని స్వామి ఆ తర్వాత మీడియాతో పేర్కొన్నారు. ‘అందరినీ ప్రశ్నించాలి.. కొందరు దోషులు కాకపోవచ్చు’ అని అన్నారు.
ఆ ‘బ్లాక్ లిస్ట్’ ఉత్తర్వు చూపండి: పరీకర్
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన యూపీఏ ప్రభుత్వ ఉత్తర్వును చూపాలని రక్షణమంత్రి పరీకర్ కాంగ్రెను ప్రశ్నించారు. ఆ ఉత్తర్వు ఎప్పడిచ్చారో చెప్పాలన్నారు. దీనిపై పార్లమెంటులో మాట్లాడుతానన్నారు. ఇటలీ కోర్టు ఉత్తర్వు ప్రతి తమ శాఖకు అందిందన్నారు. అగస్టా కంపెనీని యూపీఏ సర్కారు బ్లాక్‌లిస్ట్‌లో పెడితే.. ఎన్‌డీఏ ప్రభుత్వం దాన్నుంచి తొలగించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘ఆ సంస్థను ఎన్నడూ బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని మీరంటారా?’ అని ప్రశ్నించగా తాను అలా అనటం లేదన్నారు.
ఇదీ అగస్టా వివాదం.. ఇటలీ కేసు..!
భారత ప్రభుత్వం మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఉన్నతస్థాయి రాజకీయ నేతల వినియోగం కోసం 2010లో రూ. 3,600 కోట్లతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు ఆదేశమిచ్చింది. ఆ చాపర్లను అగస్టావెస్ట్‌ల్యాండ్ సరఫరా చేసింది. దాని మాతృ సంస్థ ఫిన్‌మెక్కానికా ఇటలీలో ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలన్నాయి. దర్యాప్తులో భారత్‌లోనూ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు తోడయ్యాయి. భారత అధికారులు అగస్టా చాపర్లను ఎంపిక చేసేలా బ్రిటిష్ వ్యాపారవేత్త మైఖేల్‌తో పాటు, స్విస్-ఇటలీ దేశస్తుడైన గౌడో హష్కేలు ప్రభావితం చేశారని ఇటలీ కోర్టులో ఆ దేశ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అగస్టా భారత అధికారులకు రూ. 330 కోట్ల మేర ముడుపులను చేరవేసేందుకు బ్రిటిష్ వ్యాపారి మైఖేల్‌ను కన్సల్టెంట్‌గా నియమించుకుందని పేర్కొన్నారు.
ఆ కోర్టు ఇటీవల తీర్పు చెప్తూ.. అగస్టా అధికారులు భారత అధికారులకు ముడుపులు చెల్లించినట్లు ఆధారాలు ఉన్నాయంది. ‘ఆ సంస్థ మైఖేల్‌కు 440 లక్షల యూరోలు చెల్లించింది. ఆయన ఆ సంస్థకు చేసిన పనికి ఈ భారీ మొత్తం చెల్లింపులకు ఏ మాత్రం పొంతన లేదు’ అని పేర్కొంది. అగస్టా విక్రయాల్లో అవినీతి చోటు చేసుకుందని తేల్చింది. ఈ ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ సోనియా, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్‌పటేల్, వైమానిక దళ మాజీ అధిపతి ఎస్.పి.త్యాగిలు రాతపూర్వకం సిఫార్సు చేశారని మైఖేల్ ఒక లేఖ ద్వారా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. తీర్పులో నాటి వైమానిక దళాధిపతి ఎస్.పి.త్యాగి పాత్రనూ తప్పుబట్టింది. ముడుపులు ఆయన బంధువులు అందుకున్నట్లుగా పేర్కొంది. కోర్టు ఉత్తర్వులో మైఖేల్.. భారత ప్రధాని మోదీకి రాసిన లేఖనూ జతచేర్చారు. ఇటలీలో అవినీతి ఆరోపణలు రావటంతో.. భారత్ అగస్టాతో కాంట్రాక్టును 2014లో రద్దుచేసింది. ఇటలీ కోర్టు తీర్పు కాంగ్రెస్‌కు ఇబ్బందిలోకి నెట్టింది.
నా పాత్ర ఏమీ లేదు: మోదీకి లేఖ.. అగస్టా కేసులో భారత్‌లోనూ నిందితుడిగా ఉన్న మైఖేల్.. స్కాంలో తన పాత్ర ఏమీ లేదంటూ గత ఏడాది నవంబర్‌లో మోదీకి ఒక లేఖ రాశారు. ఈ కేసులో భారత్‌కు వచ్చి అధికారుల విచారణకు సహకరించటానికి సిద్ధమంటూనే.. తన పాత్రను నిరూపించటానికి సమర్పించిన పత్రాలు.. ‘ఎవరిపైన అయినా కక్ష ఉంటే.. వారిని ఏదో కేసులో ఇరికించటానికి భారత హవాలా డీలర్లు చాలా మంది ఉపయోగించే పాత కిటుకుల్లో ఒకటి’ అని అన్నారు. ముడుపుల ఆరోపణలు నిజమని భారత్ భావించినట్లయితే.. ఇటలీలో ఇదే అవినీతి ఆరోపణలపై అరెస్టయిన ఫిన్‌మెక్కానికా అధినేత గెసైప్ ఓర్సీని 2014లో విడుదల చేసినపుడు, దానిని ఎందుకు సవాల్ చేయలేదని తన లేఖలో ప్రశ్నించారు. అదే నిజమైతే.. అగస్టా కేసులో తమకు ‘సహాయం’ చేస్తే, భారతదేశంలో ఇద్దరు మత్స్యకారులను హత్యచేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటలీ మెరైన్ల కేసులో ప్రతి సాయం చేస్తామని మోదీ గత ఏడాది ఇటలీ ప్రధానిని ఎందుకు కోరారన్నారు.
సోనియా కుటుంబాన్ని కలవలేదు... మరోవైపు.. సోనియాగాంధీ కుటుంబంతో తనకు, తన తండ్రికి సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తలు అతిశయోక్తి అంటూ మైఖేల్ తాజాగా గుర్తుతెలియని దేశం నుంచి సీఎన్‌ఎన్-న్యూస్18కి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తిరస్కరించారు. తనకు తెలిసినంతవరకూ సోనియా కుటుంబానికి తన తండ్రి అంత దగ్గర కాదని, తాను కూడా ఆ కుటుంబ సభ్యులు, లేదా బంధువుల్లో ఎవరినీ ఎప్పుడూ కలవలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘మోదీ - రెంజీ భేటీ కాలేదు’.. గత ఏడాది న్యూయార్క్‌లో మోదీ, ఇటలీ ప్రధాని రెంజీలు భేటీ కాలేదని విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ, రెంజీలు న్యూయార్క్‌లో భేటీ అయ్యారని.. అగస్టా ఒప్పందం అవినీతిలో సోనియాకు సంబంధముందన్న ఆధారాలు అందిస్తే.. భారత్‌లో హత్యారోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఇటలీ మెరైన్లను విడుదల చేస్తామని మోదీ ప్రతిపాదించారన్న మైఖేల్ ఆరోపణలకు పై విధంగా బదులిచ్చింది.
ఇది వ్యక్తిత్వ హననం
బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టడానికి సోనియా గాంధీ స్వయంగా ముందు నిలిచారు. ఆమె పార్లమెంటు భవనంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆధారాలు ఏవి? వారు అబద్ధాలాడుతున్నారు. వ్యక్తిత్వాన్ని హత్యచేసే కుట్రలో అవి భాగం. వీరు ఆ పని చేస్తున్నారు. ప్రభుత్వం గత రెండేళ్లుగా ఉంది. వారు ఏం చేస్తున్నారు? విచారణ జరుగుతోంది. దానిని ఎందుకు పూర్తిచేయరు? దానిని సత్వరం పూర్తి చేయండి.. నిష్పాక్షికంగా. తద్వారా నిజం బయటకు వస్తుంది’’ అని ధ్వజమెత్తారు.