న్యూఢిల్లీ: రానున్న రాష్ట్రపతి ఎన్నికలను పురస్కరించుకొని ఒకే వేదికపైకి రావాలని, పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామ్య, లౌకిక ఫ్రంట్ ఏర్పాటుకు అ వేదికపైనే అంకురార్పణ జరగాలని ప్రతిపక్ష పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి. అప్పుడే కార్యరంగంలోకి కూడా దిగాయి. జూలైలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పాలకపక్ష అభ్యర్థికి పోటీగా ఉమ్మడి అభ్యర్థి ఎంపిక కసరత్తును భుజానికెత్తుకున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఆ దిశగా చర్చలు జరుపుతోంది.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జేడీయూ సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ పేర్లు చక్కెర్లు కొడుతున్నాయి. పాలకపక్ష బీజేపీ ఈ సారి రాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ వర్గం నుంచి ఎంపిక చేస్తుందన్న వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు వీరి పేర్లను పరిశీలిస్తున్నాయి. సోనియా గాంధీ ఇప్పటికీ సీపీఐ నాయకుడు డీ. రాజా, సీపీఎం నాయకుడు సీతారామ్ ఏచూరి, ఎన్‌సీపీ నాయకుడు శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధ్యక్షులు నితీష్ కుమార్‌లతో చర్చలు జరిపారు. రాష్ట్రపతి అభ్యర్థిని గెలుచుకునేంత ఓట్ల సంఖ్య తమకు లేదని, ప్రతిపక్షాల ఐక్యతకు చిహ్నంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్నది తమ అభిమతమని జేడీయు అధికార ప్రతినిధి కేసీ త్యాగి వ్యాఖ్యానించారు. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఐక్య సంఘటనగా ఎదుర్కొనేందుకు రాష్ట్రపతి ఎన్నికలు తమకు తోడ్పడతాయని ఆయన అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కూటమి కూడా విజయం సాధించాలంటే పాతిక వేల ఓట్లు తక్కువగా ఉన్నాయి. బిజూ జనతాదళ్, తెలంగాణ రాష్ట్రీయ సమితి, తమిళనాడులోని ఏఐఏడీఎంకే లాంటి పార్టీల మద్దుతును కూడాగట్టడం బీజేపీకి పెద్ద కష్టం కాదు. తమిళనాడులోని ఏఐఏడీఎంకే చీలిక వర్గాలను ఏకం చేసేందుకు తెరవెనక నుంచి బీజేపీ పావులు కదుపుతోంది.
జేడీయూ నుంచి రాష్ట్రీయ జనతాదళ్ వరకు, వామపక్షాల నుంచి సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీ వరకు ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రతిపక్షం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతి పత్రం ఇవ్వడంలో తమ ఐక్యతను చాటుకున్నామని, ఎన్ని విభేదాలున్నా ఒక్క సంఘటనగా ఏర్పడేందుకు మున్ముందు తమ ఐక్యతను నిలబెట్టుకుంటామని విపక్షాలు చెబుతున్నాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని అన్ని ప్రతిపక్షాలు నమ్మకపోయినా ఫిర్యాదు చేయడంలో ఏకమయ్యాయి.