సబ్సిడీలు ‘జామ్’ | subsidies are in deadlock position according to budget | Sakshi
Sakshi News home page

సబ్సిడీలు ‘జామ్’

Published Sun, Mar 1 2015 6:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

subsidies are in deadlock position according to budget

- జన్-ధన్, ఆధార్, మొబైల్ అనుసంధానం
 
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇస్తున్న భారీ సబ్సిడీలన్నీ అర్హులను మాత్రమే చేరేందుకు చర్యలు తీసుకుంటున్నామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వం చెబుతున్న తారక మంత్రం... ‘జామ్’. అంటే జన్-ధన్ యోజన... ఆధార్... మొబైల్. ఈ మూడింట్లో మొదటి ఆంగ్ల అక్షరాలు కలిపితే జామ్ అవుతుంది. జన్-ధన్ పేరిట కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తెరిచిన ప్రభుత్వం... వాటన్నిటినీ ఆధార్‌తోను, వారి మొబైల్ నంబర్లతోను అనుసంధానం చేస్తోంది. తద్వారా సబ్సిడీలతో సహా సామాజిక భద్రత పథకాలన్నీ అర్హుల్ని చేరుతాయన్నది జైట్లీ మాట. ఇప్పటికే ఎల్‌పీజీ సబ్సిడీని బ్యాంకు ఖాతాలు, ఆధార్, మొబైల్‌తో అనుసంధానం చేసిన ప్రభుత్వం... విద్యార్థుల స్కాలర్ షిప్‌లను కూడా రాష్ట్రాల సహకారంతో ఇలా చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. చివరగా పీడీఎస్‌ను కూడా ఈ కోవలోకి తేనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మున్ముందు ప్రకటించే ఏ పథకాన్నైనా... జామ్ ద్వారా అర్హులకు చేర్చాలన్నది సర్కారు ఉద్దేశం.
 
ఈ బడ్జెట్లో మూడు సామాజిక భద్రత పథకాల్ని ప్రకటించిన జైట్లీ... పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.3,000 కోట్లు, ఈపీఎఫ్‌లో రూ.6,000 కోట్లు ఎవరికీ చెందనివిగా ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ‘‘ఈ నిధితో వృద్ధుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రభుత్వ నిధుల్ని కూడా జత చేసి... వృద్ధ పింఛనర్లు, దారిద్య్ర రేఖకు దిగువనున్నవారు, చిన్న-సన్నకారు రైతుల బీమా ప్రీమియాలపై సబ్సిడీ ఇవ్వటానికి వినియోగిస్తాం. వచ్చే నెలలో పూర్తి పథకాన్ని ప్రకటిస్తాం. వృద్ధులు దాదాపు 10.5 కోట్ల మంది ఉన్న మన దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వృద్ధులకు వారి జీవనానికి అవసరమైన పరికరాలను అందించటానికి కొత్త పథకాన్ని ప్రవేశపెడతాం’’ అని స్పష్టం చేశారు. మొత్తమ్మీద ఈ పథకాలన్నిటినీ ‘జామ్’ ప్లాట్‌ఫామ్‌పైనే అమలు చేస్తామని జైట్లీ ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement