25% తగ్గిన రాయితీ సిలిండర్ విక్రయాలు
న్యూఢిల్లీ: వినియోగదారులకు వంటగ్యాస్ రాయితీ బదిలీ (డీబీటీ) పథకాన్ని అమలు చేయడంవల్ల రాయితీ సిలిండర్ల విక్రయాలు సుమారు 25 శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ గురువారం యూఎన్‌డీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలిపారు. బోగస్ లబ్ధిదారులను వీలైనంతగా ఏరివేయడంవల్లనే ఇది సాధ్యపడిందని ఆయన పేర్కొన్నారు.
డీబీటీని అమలు చేయడంవల్ల బోగస్ లబ్ధిదారులకు అడ్డుకట్ట వేయగలిగామని, దాంతో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల విక్రయాలు చాలావరకు తగ్గాయని ఆయన వివరించారు. 2014-15లో ఈ పథకంవల్ల రూ.12,700 కోట్లవరకు ఆదా చేయవచ్చని భావించామని, అయితే రూ.6,500 కోట్లమేరనే ఆదా చేయగలిగామని తెలిపారు.