
'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' చిత్రంపై దావా
నాథూరాం గాడ్సే పై రూపొందిన చిత్రం విడుదలను అడ్డుకోవాలని పుణే కోర్టులో దావా దాఖలైంది.
ముంబై: నాథూరాం గాడ్సే పై భారతీయ హిందూ మహాసభ రూపొందించిన చిత్రం విడుదలను అడ్డుకోవాలని పుణే కోర్టులో దావా దాఖలైంది. జనవరి 30న విడుదల కానున్న 'దేశ్ భక్త్ నాథూరాం గాడ్సే' చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ ఉద్యమ కారుడు హేమంత్ పాటిల్ సివిల్ దావాను కోర్టులో దాఖలు చేశారు. ఆ చిత్రం విడుదలైతే మతపరమైన విధ్వంసాలు రేకెత్తే అవకాశం ఉందని ఆ పిటిషన్ లో హేమంత్ పేర్కొన్నారు.
మహత్మా గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజునే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేయడం విద్వేషాలు రెచ్చగొట్టడమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారతీయ హిందూ మహా సభ కూడా చిత్ర విడుదలను నిలుపుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గాంధీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించినట్లు ఒక వర్గం మీడియా పనిగట్టుకుని తమపై దాడి చేస్తోందని మహాసభ జనరల్ సెక్రటరీ మున్నా కుమార్ శర్మ తెలిపారు. ఈ దావాకు సంబంధించి శుక్రవారం పుణే కోర్టులో విచారణకు రానుంది.