సీఎం స్ట్రిక్ట్ ఆర్డర్స్.. పార్టీ ఏదైనా డోన్ట్‌కేర్!
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ రాష్ట్ర పోలీసు శాఖలో భారీ మార్పు శనివారం చోటు చేసుకుంది. డీజీపీ జావేద్ అహ్మద్ స్థానంలో సుల్ఖాన్ సింగ్‌ను యోగి నియమించారు. సుల్ఖాన్ సింగ్ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సుల్ఖాన్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవరిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తులు ఏ పార్టీకి సంబంధించిన వారు అనే విషయంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారని ఆయన వెల్లడించారు. అవినీతి విషయంలో అసలు సహించేది లేదని తేల్చిచెప్పారు. గుండాగిరిని నియంత్రించడానికి పూర్తిస్థాయిలో నిష్పక్షపాత ధోరణితో ఉత్తరప్రదేశ్ పోలీసులు పనిచేస్తారని అన్నారు. యాంటీ రోమియో స్క్వాడ్ అంశంపై స్పందించిన ఆయన.. అభ్యంతరకరంగా ప్రవర్తించిన వారి విషయంలోనే యాంటీ రోమియో స్క్వాడ్ చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరైనా సరే.. గోరక్షణ, ఇతర పేర్లతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని సుల్ఖాన్ సింగ్ హెచ్చరించారు.