
లక్నో: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్ర అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాన్ని కుట్రపూరితంగా చేశారని ఆయన ఆరోపించారు. ఆమెను చంపేందుకు కావాలనే ట్రక్కుతో ఢీకొట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటన యూపీలో తీవ్ర చర్చనీయాంశమయింది. అయితే వీటన్నింటికి సమాధానం ఇస్తూ.. రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రక్కు అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, దీనిలో ఎలాంటి కుట్ర లేదని ఆయన స్పష్టం చేశారు.
ట్రక్కు డ్రైవర్, యజమానిని అరెస్ట్ చేశామని తెలిపారు. అయితే బాధితురాలి వెంట ఉండాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు లేరనే విషయంపై కూడా విచారణ జరుపుతామన్నారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకు పట్టుబడితే.. దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనలో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. బాధితురాలితో పాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment