ఫైల్ ఫోటో
లక్నో : ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలి ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్‌పై కేసు నమోదైంది. మరో పదిమంది పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. హత్య, హత్యాయత్నం, కుట్ర తదితర సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు మరో పదిమందిపై కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తాజా ప్రమాద ఘనటపై జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని మమత కోరారు. దేశంలో ఫాసిస్ట్ పాలన కొనసాగుతోంది. ప్రతీరోజు మూకహత్య ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిపై ప్రధాని దృష్టిపెట్టాలన్నారు.ఈ ప్రమాదంపై అత్యున్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. అటు బాధితురాల్ని హతమార్చేందుకే ప్రమాదం పన్నాగం పన్నారని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం నంబరు ప్లేటులేని ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రాణాపాయ స్థితిలో వీరిద్దరూ చికిత్స పొందుతున్నారు.
కాగా అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు 2017లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో పోలీసుల కస్టడీలోనే ఆమె తండ్రి మరణించడం, దీనిపై నిష్పక్షపాత విచారణ జరగడంలేదంటూ బాధితురాలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఇంటి ముందే ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులోఅరెస్టు అయిన కులదీప్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment