సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నావ్ అత్యాచార ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాచార బాధితురాలికి మధ్యంతర పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మొత్తం శుక్రవారం వరకు అందజేయాలని స్పష్టం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి, ఆమె తరపు న్యాయవాదికి, ఆమె కుటుంబానికి రాయ్‌బరేలీ సీఆర్పీఎఫ్ యూనిట్ భద్రత కల్పించాలని సీజేఐ రంజన్ గగోయ్ నేతృత్వంలోని బెంచ్ వెల్లడించింది. కాగా, బాధితురాలు ప్రయాణిస్తున్న వాహనం జూలై 28న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
(చదవండి : ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!)
ఈ ఆక్సిడెంట్‌లో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించగా, బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. వెంటిలేటర్‌పై ఉత్తరప్రదేశ్‌లోని కింగ్ జార్జి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అవసరమైన పక్షంలో యువతిని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని కోర్టు చెప్పింది. ప్రమాదానికి గల కారణాలను 14 రోజుల్లోగా తేల్చాలని అత్యున్నత న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అత్యాచార ఘటనకు సంబంధించి ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న ఐదు కేసులనూ ఢిల్లీ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం ఆదేశించింది. 45 రోజుల్లో కేసుల విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. తదుపరి వాదనలు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో నిందితుడు, ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment